ఇంకా తొలగించని ఆటోస్టార్టర్లు
24 గంటల విద్యుత్ వచ్చినా మారని రైతులు
హైదరాబాద్,మే3(జనం సాక్షి): ఇదిలావుంటే తెలంగాణలో వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరా మొదలయినా ఆటోస్టార్టర్లను రైతులు తొలగించడం లేదు. దీంతో భూగర్భ జాలాల సమస్య వస్తోంది. ఇప్పుడు ఆటోమేటిక్ స్టార్టర్లను స్వచ్చందంగా తొలిగించాలని డిస్కం అధికారులు రైతులను కోరుతున్నారు. గతంలో విద్యుత్ సరఫరాలో నిరంతరం కలుగుతున్న అంతరాయంతో విసుగుపోయిన అన్నదాతలు ఆటోమేటిక్ స్టార్టర్ల వైపు మొగ్గు చూపారు. కరెంట్ వచ్చినప్పుడు, పోయినప్పుడు ఆటోమేటిక్ స్టార్టర్లు ఆన్, ఆఫ్ అయ్యేవి. దీనితో మాటి, మాటికి కలిగే ఇబ్బందుల నుండి రైతులకు కొంత వెసులుబాటు కలిగింది. దీనిని దృష్టిలో పెట్టుకునే రైతులు ఆటోమేటిక్ స్టార్టర్లు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. వ్యవసాయానికి ఇప్పటికే 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న సీఎం కేసీఆర్ మరికొద్ది రోజుల్లోనే 24 గంటల సరఫరాకు చేయనుండటంతో రైతులకు ఇక నుంచి ఆటోమేటిక్ స్టార్టర్ల అవసరం ఉండదు. అందుకే రైతులు వినియోగిస్తున్న ఆటోమేటిక్ స్టార్టర్లను స్వచ్ఛందంగా తొలిగిస్తే విద్యుత్ సరఫరాలో కలిగే అంతరాయాలను నియంత్రించవచ్చని డిస్కం అధికారులు సూచిస్తున్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా అమల్లోకి రావడంతో వినియోగం నెలకు సుమారు 40 శాతం అదనంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు డిస్కం అధికారులు అంచనా వేస్తున్నారు. భారీగా పెరగనున్న వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని పొదుపు అలవర్చుకుంటే ఆర్థికంగా వెసులుబాటు కూడా కలుగుతుందని సూచిస్తున్నారు. ఆటోమేటిక్ స్టార్టర్ల వినియోగం ప్రధానంగా గుర్తించిన అధికారులు వాటి నిషేదంపై దృష్టి సారించారు. రైతులే స్వచ్ఛందంగా ఆటో స్టార్టర్లను తొలిగించి టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ సంస్థ అభివృద్ధికి తోల్పాటునందించాలని కోరుతున్నారు.
—————-