ఇక పొన్నాల వంతు

హైదరాబాద్‌, జూన్‌ 4 (జనంసాక్షి) :జగన్‌ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే మంత్రి మోపిదేవిని విచారించిన సీబీఐ, ఆయనను జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఎ-1 నిందితుడు జగన్‌ కూడా సీబీఐ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. జగన్‌ అక్రమ సంపాదనకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ హయాంలోని ఆరుగురు మంత్రుల్లో ఇప్పటి వరకు ఒక్క మోపిదేవి మాత్రమే సీబీఐ విచారణకు హాజరై జైలులో సేదదీరు తున్నారు. ఇప్పుడు మిగిలిన ఐదుగురిలో మరో మంత్రిని విచారించేందుకు సీబీఐ సన్నాహాలు చేస్తున్నది. వైఎస్‌ హయాంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సీబీఐ సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. జగన్‌ వ్యాపార సంస్థలకు నీటి కేటాయింపులపై పొన్నాల సీబీఐ ప్రశ్నల తూటాలను ఎదుర్కోనున్నారు. దీని కోసం ఈనెల 7న తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ పొన్నాలకు కబురు పంపింది. ఒకే కేసు విషయంలో ఆరుగురు రాష్ట్ర మంత్రులు ఆరోపణలు ఎదుర్కోవడం ఓ సంచలనమైతే, ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ఎదుట హాజరైన వారు ఒక్కొరొక్కరుగా జైలుకు పోతుండడం మరో సంచలనం. ఇదిలా ఉండగా, ఆ ఆరుగురు మంత్రుల్లో మొదటిసారి మోపిదేవి జైలు ఊచలు లెక్కపెడుతుండడం, ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య విచారణకు హాజరవనుండడంతో మిగిలిన నలుగురు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద్‌రావు, గీతారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నట్లు సమాచారం. ఏదో ఒకరోజు తమకు కూడా సీబీఐ ఆహ్వానం అందుతుందేమోనని నలుగురు మంత్రులు గుబులు చెందుతున్నట్లు తెలిసింది