ఇస్లామిక్‌ బ్యాంకుకు అనుమతించండి

ఇస్లాం సమిట్‌ -12 సదస్సులో వక్తలు
హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) : మన దేశంలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని హైదరాబాద్‌లో జరిగిన ‘ఇస్లాం సమిట్‌ – 2012’ అనే కార్యక్రమంలో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. చాలా దేశాల్లో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ నడుస్తున్నదని, భారత్‌లో కూడా దీన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ రూపకల్పనతో ముస్లింల మనోభావాలను గౌరవించినట్లు అవుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న బ్యాంకింగ్‌ వ్యవస్థను వాడుకోవడానికి ముస్లింలు తమ మతాచారాలాను ఉల్లంఘిస్తున్నట్లు భావించి ఆత్మన్యూ నతకు గురవుతున్నారని వారు వివరించారు. ఈ కార్యక్రమానికి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ హయాంలో ఈ కోటా వల్ల కొంతమంది ముస్లింలు లాభపడ్డారని తెలిపారు. ముస్లింలు కూడా ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌, రిజర్వేషన్ల కోసం తమ గళాన్ని తమ తమ ప్రాంతాల ప్రజాప్రతినిధులకు వినిపించాలని ఆయన కోరారు.