ఉత్తరాదిన భాజపా హవా

` రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌లో కాషాయ జెండా రెపరెపలు
` మధ్యప్రదేశ్‌లో అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని బీజేపీ
` పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు :మోదీ
న్యూఢల్లీి(జనంసాక్షి):సార్వత్రిక ఎన్నికలకు ముందు సెవిూఫైనల్‌గా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నాలుగు రాష్ట్రాల ఫలితాలు నేడు వెలువడ్డాయి. ఇందులో భాజపా కు భారీ విజయం దక్కింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను మించి.. హిందీ రాష్ట్రాలైన రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌లో కాషాయ జెండా రెపరెపలాడిరది. మధ్యప్రదేశ్‌లో అఖండ మెజార్టీతో కమలనాథులు ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. ఇక, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ను గద్దె దించి భాజపా అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమైంది.రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. మూడు దశాబ్దాల సంప్రదాయాన్ని పునరావృతం చేస్తూ.. తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా విజయం సాధించింది. ఈ రాష్ట్రంలో మొత్తం 200 నియోజకవర్గాలుండగా.. 199 స్థానాలకు నవంబరు 25న పోలింగ్‌ జరిగింది. ప్రభుత్వాన్ని ఆదివారం వెలువడుతున్న ఫలితాల్లో భాజపా మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరింది. ఇప్పటివరకు 101 స్థానాల్లో విజయం సాధించి.. మరో 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కాంగ్రెస్‌ 61 చోట్ల గెలిచి.. 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిగతా 14 స్థానాలను ఇతరులు దక్కించుకుంటున్నారు.ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు మించి మధ్యప్రదేశ్‌లో అధికార భాజపా అఖండ మెజార్టీతో విజయం దిశగా పయనిస్తోంది. ఈ రాష్ట్రంలో మొత్తం 230 స్థానాలుండగా.. ఇప్పటివరకు భాజపా 110 స్థానాల్లో విజయం సాధించి.. మరో 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తంగా ఈ పార్టీ 167 స్థానాలతో అఖండ మెజార్టీని దక్కించుకునే అవకాశముంది. కాంగ్రెస్‌కు 62 సీట్లు (30 గెలుపు G 32 ఆధిక్యం) దక్కే అవకాశం కన్పిస్తోంది. ఇతరులు ఒక చోట గెలిచారు.ఛత్తీస్‌గఢ్‌లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తారుమారయ్యాయి. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మరోసారి విజయం సాధిస్తుందనే అభిప్రాయాలు వినిపించగా.. అనూహ్యంగా భాజపా విజయఢంకా మోగించింది. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 సీట్లు కావాలి. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో భాజపా 22 చోట్ల గెలిచి.. మరో 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ 32 స్థానాలకు (10 గెలుపు G 22 ఆధిక్యం) పరిమితమైంది. ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు :మోదీ
దిల్లీ: ఆదివారం వెలువడుతోన్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో భాజపా స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఈ తీర్పుపై ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా స్పందించారు.పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ’దేశ ప్రజలు సుపరిపాలన, అభివృద్ధిపైనే విశ్వాసం ఉంచుతారని మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాల వెల్లడిచేస్తున్నాయి. భాజపాపై నమ్మకం ఉంచిన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు, యువఓటర్లకు నా కృతజ్ఞతలు. విూ సంక్షేమం కోసం మేం చేస్తోన్న పనిని కొనసాగిస్తామని హవిూ ఇస్తున్నాను. ఈ సందర్భంగా పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భాజపా అభివృద్ధి కార్యక్రమాలను, పేదల సంక్షేమ పథకాలను విూరు ప్రజల్లోకి తీసుకెళ్లిన తీరు అభినందనీయం. అభివృద్ధి చెందిన భారతాన్ని సృష్టించే లక్ష్యంతో మన పయనాన్ని కొనసాగిస్తున్నాం. ఈ ప్రయాణంలో మనం ఆగిపోకూడదు. అలసిపోకూడదు. ఈ దిశగా ఈ రోజు మనం ఒక అడుగు వేశాం’ అని మోదీ ట్వీట్‌ చేశారు.కాగా
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు.’’ బుజ్జగింపు, కుల, కుటుంబ రాజకీయాలను నవ భారతం అంగీకరించదు. ప్రభుత్వ పనితీరు ఆధారంగానే ప్రజలు ఓటేస్తారనేందుకు ఈ ఫలితాలే నిదర్శనం’’ అని అమిత్‌ షా అన్నారు. మధ్యప్రదేశ్‌లో భాజపా డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సుపరిపాలనకు రాష్ట్ర ప్రజలు మద్దతు తెలిపి, గొప్ప విజయాన్ని అందించారని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలని అమిత్‌ షా పేర్కొన్నారు.ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన, పేద, రైతు సోదరసోదరీమణులు ప్రధాని మోదీపై విశ్వాసంతో భాజపాకు సంపూర్ణ మెజార్టీని అందించారని తెలిపారు. తెలంగాణ ప్రజల మద్దతుకు కృతజ్ఞతలు చెబుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో భాజపా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు.