ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత : సీఎం


నివేదిక సమర్పించిన కేబినెట్‌ సబ్‌కమిటీ
చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఎపిఇఎంఎస్‌): ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు కోసం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై ఏర్పాటు చేసిన ఉప సంఘం నివేదికపై క్యాబినెట్‌లో చర్చించి అమోదిస్తామని ఆయన చెప్పారు. ఇందుకోసం త్వరలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలుపై ఏర్పాటైన ఉప సంఘం శనివారం నాడు సచివాలయంలో ముఖ్యమంత్రికి నివేదికను అందజేసింది. ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి మాట్లాడుతూ
రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తున్న నిధులలో ఇక నుంచి కోత ఉండబోదని చెప్పారు. సమాజంలో పేద, బడుగు, బలహీన వర్గాల, అట్టడుగు వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే నిజమైన అభివృద్ధికి నాంది అని అన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం మొదటి నుండి కృషి చేస్తున్నది కాంగ్రెస్‌ పార్టీయేనని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తున్న నిధులను ఖర్చు చేయని మాట వాస్తవమేనని ముఖ్యమంత్రి అన్నారు.
ఉప సంఘం రూపొందించిన నివేదిక రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యయానికి తెరతీసిందని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చాలా కాలం నుంచి అమలవుతున్నదని ముఖ్యమంత్రి అన్నారు. అయితే ఈ నిధులు సక్రమంగా ఖర్చు కావడం లేదన్న విమర్శల నేపథ్యంలో, ఉన్న వాస్తవికతను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రణాళికను రూపొందించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దాదాపు రెండువేల కోట్ల రూపాయలు ఎస్సీ, ఎస్టీ నిధులు మిగులుతున్నాయని ఆయన అన్నారు. ఈ ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని వర్గాల ప్రజల, ప్రతిపక్షాల సలహాలు, సూచనల మేరకు ఈ ప్రణాళిక కట్టుదిట్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు క్షేత్రస్థాయిలో జరగాలంటే నిఘా తప్పనిసరి అని ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, ఈ ఉప ప్రణాళికతో వారికి మేలు ఎంతో జరుగుతుందని అన్నారు. ఈ నివేదికకు వీలైనంత త్వరగా చట్టబద్ధత కల్పిస్తామన్నారు. అందుకోసం అవసరమైన నిబంధనలు సవరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీల సంపూర్ణ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఉప ప్రణాళిక అమలుకు ప్రత్యేక అధికారాలు ఉన్న వ్యవస్థ అవసరమని అన్నారు. ఇది ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చేయడం లేదని, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసమే చేస్తున్నామని స్పష్టం చేశారు. అభివృద్ధిలో ఎస్సీ, ఎస్టీల భాగస్వామ్యం ఉండాలని అన్నారు. ఉప ప్రణాళిక అమలులో ఆంధ్ర ప్రదేశ్‌ ఆదర్శంగా ఉండేలా కృషి చేస్తామన్నారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నారని అన్నారు. ఈ నివేదిక ప్రకారం జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించాలని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా మోడల్‌ ఏజెన్సీని ప్రతిష్ఠ పరచాలని, ఈ ప్రణాళికకు చట్టబద్ధత కల్పించాలని నివేదికలో పొందుపరిచినట్టు ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయిస్తున్న నిధులు దుర్వినియోగం కాకుండా భద్రత కల్పించాలని కూడా ఇందులో కోరినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్క్‌షాప్‌లు నిర్వహించి ఈ నివేదిక రూపొందించడం జరిగిందని ఆయన అన్నారు. బడ్జెట్‌లో నిధుల్లో కేటాయిస్తున్న ప్రతిపైసా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చేరాలని నివేదికలో పేర్కొనడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు గీతారెడ్డి, శైలజానాధ్‌ తదితరులు పాల్గొన్నారు.