ఐదుపైసలు దుర్వినియోగమైనా.. 

నా ఆస్తంతా రిసిచ్చేస్తా
– ‘మా’లో విభేదాలు లేవు
– నిధులు దుర్వినియోగం కాలేదు
– ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా
హైదరాబాద్‌, సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి) :  సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో ‘మా’ నిధుల్లో ఐదు పైసలు దుర్వినియోగం అయినట్లు నిరూపించినా తాను గుండె గీయించుకొని అసోసియేషన్‌ను పక్కకు తప్పుకుంటానని, అంతేకాకుండా నా ఆస్తంతా రాసిచ్చేస్తానని ‘మా’ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజిరాజా అన్నారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో మరో వివాదం తలెత్తింది. సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో ‘మా’ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు రావడం కలకలం రేపింది. దీనిపై స్పందించి ‘మా’ కార్యవర్గం సోమవారం సమావేశమై చర్చించింది. ఈ సమావేశానికి ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్‌ హాజరయ్యారు. సమావేశం అనంతరం శివాజీరాజా విూడియాతో మాట్లాడుతూ.. ‘మా’ నిధులు దుర్వినియోగమయ్యాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అసోసియేషన్‌లో 5పైసలు దుర్వినియోగమైనా తన ఆస్తినంతా రాసిచ్చేస్తానని సవాల్‌ చేశారు. సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు ఒప్పందం ప్రకారమే డబ్బు వసూలైందని.. నిధులు దుర్వినియోగం చేసినట్లు ఎవరైనా నిరూపిస్తే అసోసియేషన్‌ శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. వేడుకల ద్వారా వచ్చే డబ్బులతో ‘మా’ అసోసియేషన్‌ నిర్మించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అసోసియేషన్‌ ఎన్నికలు సవిూపిస్తున్నందున ఉద్దేశపూర్వకంగానే తమపై ఆరోపణలు చేస్తున్నారని శివాజీరాజా ఆక్షేపించారు. కావాలనే కొందరు దుష్పచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా అసోసియేషన్‌ బిల్డింగ్‌ నిర్మాణం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నామని, అసలు చేయకుంటే ఏవిూలేదని, మంచి పనికోసం ప్రయత్నిస్తుంటే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మా అసోసియేషన్‌ డబ్బులతో  ఇప్పటి వరకు టీ కూడా తాగలేదని, ఫోన్‌ కూడా సొంతదే వాడుతున్నానని తెలిపారు. ‘మా’లో సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.
నిరూపిస్తే  శాశ్వతంగా తప్పుకుంటా – హీరో శ్రీకాంత్‌
తనపై ఆరోపణలు నిరూపిస్తే మా అసోసియేషన్‌ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని హీరో శ్రీకాంత్‌ అన్నారు. మా అసోసియేషన్‌ జూబ్లీ ఇయర్‌ సందర్భంగా నూతన బిల్డింగ్‌ కట్టబోతున్నామని తెలిపారు. దీని కోసం మెగాస్టార్‌ చిరంజీవిని కలిసామని ఆయన రెండు కోట్ల డొనేషన్‌ ఇస్తానని, ఇప్పటికే కోటి రూపాయలు ఇచ్చారని చెప్పారు. ఫండ్స్‌ కోసం అమెరికాలో ప్రోగ్రాం చేసామని, చిరంజీవి ఛీప్‌ గెస్ట్‌గా వచ్చారని తెలిపారు. తరువాత స్టార్‌ హీరోలు మహేశ్‌ బాబు, ప్రభాస్‌లు వస్తారని చెప్పారు. సైరా షూటింగ్‌ వల్ల ఒక్క ప్రొగ్రామ్‌కే చిరంజీవిగారు వచ్చారని, దీంతో కోటిరూపాయలు వచ్చాయన్నారు. అగ్రిమెంట్‌ ప్రకారం కోటి రూపాయలే ఇస్తామన్నారని, ఈవెంట్‌ మేనేజర్లకు ఎక్కువ వస్తే తమేం చేస్తామని ప్రశ్నించారు. చిరంజీవి స్టామినాను ఎవరు తక్కువ చేయలేరని, ఆయన అమెరికాలో ఈవెంట్స్‌కు రారని ప్రచారం చేశారన్నారు. మా అసోసియేషన్‌ అకౌంట్స్‌ అన్ని క్లియర్‌ గా ఉన్నాయని స్పష్టం చేశారు. తన విూద చేసిన ఆరోపణలు నిరూపించాలని శ్రీకాంత్‌ సవాల్‌ విసిరారు. మా అసోసియేషన్‌లో ప్రస్తుతం రూ.5 కోట్ల వరకు డబ్బులున్నాయని పరుచూరి వెంకటేశ్వరావు తెలిపారు. ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. కావాలనే కొందరు అసత్యాలను ప్రచారం చేయడం సరికాదన్నారు.