ఓఆర్‌ఆర్‌పైకి బైక్‌లు, ట్రాక్టర్లకు అనుమతి లేదు
– పార్కింగ్‌కోసం వెయ్యి ఎకరాలు కేటాయించాం
– 20వేల మందితో భద్రత
– రాచకొండ సీపీ మహేశ్ భగవత్
హైదరాబాద్, సెప్టెంబర్1(జనం సాక్షి ) : టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు కొంగరకలాన్‌లో నిర్వహించే ప్రగతి నివేదన సభ నేపథ్యంలో.. ఔటర్ రింగ్ రోడ్డుపైకి ద్విచక్ర వాహనాలను, ట్రాక్టర్లను అనుమతించబోమని రాచకొండ సీపీ మహేశ్ భగవత్, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ జితేందర్లు శనివారం స్పష్టం చేశారు. ప్రగతి నివేదన సభా ప్రాంగణంలో మహేశ్ భగవత్, జితేందర్ కలిసి విూడియాతో మాట్లాడారు. పార్కింగ్ కోసం వెయ్యికిపైగా ఎకరాలు కేటాయించామని తెలిపారు. వాహనాలను పార్కింగ్ స్థలాల్లోనే నిలపాలని కోరారు. సభావేదిక వద్దకు వాహనాలు వెళ్లాల్సిన మార్గాల గురించి ఇప్పటికే వివరంగా చెప్పామన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాక్టర్లను శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే ఓఆర్‌ఆర్ పరిధిలోకి అనుమతిస్తామన్నారు. ఆదివాకం ట్రాక్టర్లను ఓఆర్‌ఆర్ లోపలికి అనుమతించమని స్పష్టం చేశారు. అత్యవసర వాహనాలకు అందరూ దారి వదిలి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. దాదాపు 20 వేల మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నారని చెప్పారు. వాహనాలు స్తంభించకుండా, భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ట్రాక్టర్ల కోసం ఫ్యాబ్ సిటీలో పార్కింగ్ ఏర్పాట్లు చేశామని తెలిపారు. సభ సందర్భంగా 20వేల మంది పోలీసులతో సభా ప్రాంగణం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. సభా వేదిక, పార్కింగ్ ప్రాంతాల్లో కూడా నీటి వసతులు కల్పించామని, పార్కింగ్ ప్రాంతాల్లో 400 మంది వలంటీర్ల సేవలను అందిస్తామని సీపీ తెలిపారు.



