ఓట్ల తొలగింపుదారులపై..  చర్యలు తీసుకోండి


– పులివెందుల పోలీసులకు వివేకానందరెడ్డి ఫిర్యాదు
కడప, మార్చి4(జ‌నంసాక్షి) : ఏపీలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓట్ల తొలగింపు ప్రక్రియ చర్చనీయాంశంగా మారుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తమ ఓట్లను తొలగిస్తున్నారంటూ వైసీపీ, టీడీపీలు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తన ఓటు తొలగించాలని దాఖలైన నకిలీ దరఖాస్తుపై మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి  పులివెందల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓట్ల తొలగింపు అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం పులివెందుల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం వివేకానంద మాట్లాడుతూ.. తనకు తెలియకుండా.. తన పేరువిూదే ఓటు తొలగించాలని దరఖాస్తు చేయడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర నుంచే ఓట్ల తొలగింపునకు వ్యుహరచన జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షల ఓట్లు తొలగించేందుకు అధికార టీడీపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఇది ప్రజల హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. ఈ అంశంలో ఎన్నికల కమిషన్‌ కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. తన ఓటు గల్లంతుపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. ఇదిలాఉంటే  వైఎస్‌ వివేకానందరెడ్డికి ఓటు తొలగించాలని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం తహశీల్దార్‌ కార్యాలయానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు పంపారు. అయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా
అధికార టీడీపీ.. ప్రతిపక్ష వైసీపీ సానుభూతిపరుల ఓట్లను దొంగ సర్వేల ద్వారా గుర్తించి వాటిని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్‌ వివేకానందరెడ్డితోపాటు పులివెందుల నియోజకవర్గంలోని చాలా మంది వైసీపీ సానుభనూతిపరుల ఓట్ల తొలగింపుకు ఆన్‌లైన్‌లో భారీగా దరఖాస్తులు రావడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడేవారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్‌ చేస్తున్నారు.