కలెక్టర్‌కు పరామర్శల వెల్లువ

శ్రీకాకుళం, ఆగస్టు 3: శ్రీకాకుళం పట్టణానికి సమీపంలోని సనపలవానిపేట వద్ద గల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌కు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేరుగా కలెక్టర్‌కు ఫోన్‌ చేసి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి మిన్నమాథ్యు ఫోన్‌ చేసి జరిగిన ప్రమాదం, గాయాలపై ఆరా తీశారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. వారితో పాటు ముఖ్యమంత్రి పేషీలోని, వివిధశాఖల కార్యదర్శులుగా ఉన్న ఐఎఎస్‌ అధికారులు, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామరాజు, కోండ్రు మురళీమోహన్‌, టిడిపి నేత ఎర్రన్నాయుడు కలెక్టర్‌కు ఫోన్‌ ద్వారా పరామర్శించారు. సౌరభ్‌గౌర్‌ గతంలో పనిచేసిన నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు ఫోన్‌ చేసి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం ఎంపీ డా. కె.కృపారాణి నేరుగా కలెక్టర్‌ అధికార నివాసానికి వెళ్లి పరామర్శించారు.