కార్యకర్తల అభిష్టానికి వ్యతిరేకంగా..  ఆమంచిని పార్టీలో చేర్చుకున్నారు

– కనీసం తనను కూడా సంప్రదించలేదు
– జగన్‌కు లేఖరాసిని చీరాల వైసీపీ ఇన్‌చార్జి బాలజీ
విజయవాడ, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : చీరాల కార్యకర్తల అభిష్టానికి వ్యతిరేఖం, కనీసం నన్నుకూడా సంప్రదించకుండా ఆమంచిని వైసీపీలో చేర్చుకున్నారని చీరాల వైసీపీ సమన్వయకర్త యడం బాలాజీ జగన్‌ తీరుపై మండిపడ్డారు. ఈమేరకు బుధవారం ఆమంచిపై ఆయన పలు ఆరోపణలు చేస్తూ.. వైసీపీ అధినేత జగన్‌కు బాలాజీ బహిరంగలేఖ రాశారు. జగన్‌ ఓదార్పు యాత్ర సమయంలో ఆమంచి ఆగడాలు తట్టుకోలేక
తనను పార్టీలోకి ఆహ్వానించారని గుర్తు చేశారు. ఎన్‌ఆర్‌ఐగా ఉన్న తాను అన్నీ వదులుకుని 9ఏళ్లు పార్టీ కోసం పనిచేశానని, ఆమంచి లాంటి రౌడీని పార్టీలో చేర్చుకోవద్దని చెప్పినా వినలేదని లేఖలో ఆరోపించారు. తన లేఖపై స్పందించకుంటే వైసీపీ ఓటమి లక్ష్యంగా పని చేస్తానని యడం బాలాజీ స్పష్టం చేశారు. ఆమంచి చేరికపై జగన్‌ పునరాలోచన చేయాలని, లేనిపక్షంలో చీరాలలో వైకాపాను ఓడించి తీరుతామని స్పష్టంచేశారు. లేఖపై రెండు మూడు రోజుల్లో జగన్‌ సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమాధానం రాకపోతే కార్యకర్తల కోరిక మేరకు పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పారు. ఆమంచిని చేర్చుకునే ముందు తనకు కనీస సమాచారం లేదన్నారు. ఆమంచి చేరికపై మాట్లాడేందుకు జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రకాశం జిల్లాలో చాలా మంది జగన్‌ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. పార్టీకి తొలి నుంచీ సేవ చేసిన వారిని కాదని చివరి నిమిషయంలో వచ్చిన వారిని చేర్చుకోవడం దారుణమన్నారు. ఆమంచి అరాచకాలను ఎదిరించేందుకు తన కుటుంబాన్ని జగన్‌ స్వయంగా పిలిచారన్నారు. తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని, జగన్‌ చేసిన మోసానికి తన మనసు క్షోభిస్తోందన్నారు.  మరోవైపు యడం బాలాజీ టీడీపీలో చేరో యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. భవిష్యత్‌ పయనంపై ఓ నిర్ణయం తీసుకునేందుకు ఆయన అనుచరులతో మంతనాలు కూడా ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు విజయవాడకు చెందిన ఒకరిద్దరు టీడీపీ నాయకులు బాలాజీతో చర్చలు కూడా జరిపారు. మరో వైపు చీరాల నియోజకవర్గంలో కింది స్థాయిలో నాయకులపై ఇరుపార్టీల ముఖ్య నేతల నుంచి ఒత్తిడి పెరిగింది. ఆమంచి కృష్ణమోహన్‌ ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి జగన్‌ను కలిసి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ అధిష్ఠానం వేగంగా స్పందించి పలు మార్పులు, చేర్పులకు శ్రీకారం పలికింది. ఈ నేపథ్యంలో చీరాలలో రాజకీయంగా వేడి రాజుకుంది.

తాజావార్తలు