కిన్నెరసాని ఆశ్రమ పాఠశాల సమస్యల వలయంలో విలవిల

ఖమ్మం, జూలై 28 : జిల్లాలోని పాల్వంచ మండలంలో గల కిన్నెరసాని గిరిజన ఆశ్రమ పాఠశాల అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్యల వలయంలో చిక్కుకుందన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా హాస్టల్‌ విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్న ఐటిడిఎ ఆచారణలో మాత్రం అమలు జరగడం లేదని చెప్పవచ్చు. పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని గ్రామంలో గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో దాదాపు 500 మంది విద్యార్థులు ఉంటున్నారు. విద్యార్థులు ఉండే భవన సముదాయం శిధిలావస్థకు చేరింది. దీంతో విద్యార్థులు క్షణం క్షణం భయం భయంగా జీవినం సాగిస్తున్నారు. విద్యార్థులు పడుకునే డార్మెట్రీలు, పైకప్పు పగిలిపోవడంతో వర్షం వస్తే గది అంతా వరద నీటితో నిండిపోతోంది. విద్యార్థులు పడుకోడానికి, చదువుకోడానికి ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, బాత్‌రూంలు లేక ప్రతి రోజు విద్యార్థులు కిన్నెరసాని ప్రాజెక్టు వైపు అడవిలోకి వెళ్లి స్నానాలు చేసి వస్తున్నారు. ఆశ్రమ పాఠశాల ప్రహరీ గోడ సక్రమంగా లేకపోవడంతో హాస్టల్‌లోకి పశువులు, మేకలు ప్రవేశించి విద్యార్థులతో సహజీవనం సాగిస్తున్నాయి. కిన్నెరసాని ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఇటీవల ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు సైతం ధర్నా నిర్వహించిన సంబంధించి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి కిన్నెరసాని గిరిజన ఆశ్రమ పాఠశాల సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.