కేంద్రంలో కుర్చీలాట!

పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడటంలేదని అనుకుంటుంది. అదే విధంగా కాంగ్రెస్‌ కూడా అధికారాన్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేసినా ప్రజలు పట్టించుకోవడంలేదని భావిస్తున్నట్టు ఆదివారం నాడు జరిగిన కేంద్ర కేబినెట్‌ కూర్పులో స్పష్టంగా కనిపిస్తోంది.ఆదివారం నాడు ఆట విడుపుగా టీవీల ముందు కూర్చున్న అఖిలభారతావనికి కేంద్రమంత్రుల కుర్చీలాట కాస్తంత వినోదాన్నే పంచిపెట్టింది. నిండా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులు కొందరికి పదోన్నతులు కల్పించి కాంగ్రెస్‌ తనదైన శైలిలో కూర్పు చేసింది. ఇదే చివరి విస్తరణఅంటూ, ఇది అనుభవం, యువత మేలు కలయిక అంటూ గొప్పలు చెప్పుకుంటూ కొత్త జట్టు సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటామని కేంద్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే ప్రశ్నేలేదని మన్మోహన్‌ కేంద్ర కేబినెట్‌ ప్రమాణ స్వీకారం తరువాత ధీమా వ్యక్తం చేయడం మేకపోతు గాంభీర్యమనే చెప్పవచ్చు. గత ఏడాది జూలైలో మంత్రివర్గ విస్తరణ సందర్భంలోనూ ఇదే పాట పాడారు. కేంద్ర కేబినెట్‌లో రాహుల్‌గాంధీ ప్రమేయం స్పష్టంగానే కనిపించింది. కేంద్రమంత్రి వర్గంలో రాహుల్‌ చేరికపై ప్రతిసారి ఊహాగానాలు చెలరేగడం ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నామని, మన్మోహన్‌ ప్రకటించడం షరా మామూలే. అయితే యూపీలో విజయం కోసం పాటుపడిన ఈ యువనేత అక్కడ భంగపడటంతో మంత్రివర్గంపై వడివడిగా అడుగులు వేయడం మంచిదికాదని, పార్టీ పునర్వ్యీవస్థీకరణే తన ధ్యేయమంటూ వెల్లడించి మిన్నకుండిపోయారు. అయితే పల్లంరాజు, విజయారాధిత్య సింధియా, తదితర యువ నేతలకు కీలక స్థానాలను కట్టబెట్టి యువతకు పెద్దపీట వేయించగలిగారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ కనుక అధికారంలోకి వస్తే తనదైన శైలిలో ప్రధానమంత్రి పదవిని చేపట్టి అందుకోసం అవసరమైన యువనేతలను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు రాహుల్‌ ఈ మంత్రివర్గంలోతన ప్రాబల్యాన్ని చాటుకున్నారు. పవార్‌ పార్టీకి చెందిన కారిత్‌ అన్వర్‌ను మినహాయిస్తే తాజా పునర్వ్యవస్థీకరణ అంతా కాంగ్రెస్‌ ఇష్టారాజ్యాంగానే కొనసాగింది. కుల, మత, ప్రాంతీయం, అన్నింటికంటే విధేయతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆరుగురికి మంత్రి పదవులు ఇచ్చి ఈ రాష్ట్రానికి పెద్దపీట వేశామని అధిష్టానం భావిస్తోంది. అయితే ఎవరికి ఏ పదవి వస్తుందో ఇక్కడ కీలకంగా ఉన్న ముఖ్యమంత్రి  సైతం తెలియకపోవడం గమనార్హం. ఇందులో పల్లంరాజు, చిరంజీవిలకు మంత్రి పదవులు కట్టబెట్టి కాపు వర్గానికి కాస్తంత సంతృప్తిని కల్పించారు. మరొకటైన కమ్మ సామాజికవర్గానికి చెందిన, అందరూ చిన్నమ్మగా పిలుచుకునే పురంధేేశ్వరికి తొలుత స్వతంత్ర హోదాలో వాణిజ్యం, పరిశ్రమల శాఖ కేటాయించారని స్వయంగా ఆమే చెప్పుకున్నా చివరి నిమిషంలో ఆమె సామాజికవర్గానికి చెందిన వారే అలక పూనడంతో చిన్నమ్మకు చెంతకు వచ్చిన అవకాశం చేజారిపోయింది. అలాగే 18 మంది ఎమ్మెల్యేలతో సహా పార్టీ మొత్తాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవికి దక్కింది చిన్నపాటి ప్రయోజనమేననిచెప్పవచ్చు. స్వతంత్ర హోదాలో ఉండే సహాయ మంత్రిత్వ శాఖ లాంటిదైనా టూరిజం శాఖను కట్టబెట్టారు. ఆయన అభిమానులు మాత్రం తమ అభిమాన నటుడికి ఉప ముఖ్యమంత్రి కాని, కేబినేట్‌ హోదా మంత్రిగాని వస్తుందని ఆశించారు. కాని వారికి ఆశాభంగమే ఎదురైంది. అన్నింటికంటే ఈ రాష్ట్రానికి చెందిన పెద్దాయనగా భావించే జైపాల్‌రెడ్డికి అన్యాయమే జరిగింది. గత ఏడాది జూలై మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జైరాం రమేశ్‌ను పదోన్నతితో పర్యావరణ అటవీ సంరక్షణ బాధ్యతల నుంచి తప్పించారు. దీనికి కారణం ఆనాడు ఆయన పారిశ్రామిక వర్గాల వారికి ప్రపంచీకరణ వల్ల పారిశ్రామిక దిగ్గజాలు వాతావరణ కాలుష్యానికి పాల్పడుతున్నాయని, అడవులు, వ్యవసాయ భూములు అంతరించిపోతున్నాయని అడ్డుకోవడంతో పారిశ్రామిక పెద్దలు ఆయనను ఆరోజు ఆ శాఖ నుంచి తప్పించారు. అదే పరిస్థితి ఈ రోజు జైపాల్‌రెడ్డి విషయంలో కూడా కనబడింది. ఇక్కడ పారిశ్రామిక వర్గాలకు జైపాల్‌రెడ్డి కొరకరానికొయ్యగా మారిపోయారు. అంబాని చమురు దాహానికి, ఇంధన దోపిడీకి జైపాల్‌ అడ్డంకిగా మారడంతో ఆయనను తప్పించినట్టు వినికిడి. కేజీ బేసిన్‌లో రిలయన్స్‌ పెట్టిన 1.46 మిలియన్‌ డాలర్ల ఖర్చుకు జైపాల్‌రెడ్డి అడ్డుతగలడంతో పాటు గ్యాస్‌ ధరలను పెంచటాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆయనను ఈ శాఖ నుంచి తప్పించి ప్రాధాన్యతలేని  సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి పరిమితం చేశారు. పారిశ్రామిక వర్గాలకు బహు ప్రశంసనీయుడిగా పేరొందిన మన్మోహన్‌సింగ్‌ పారిశ్రామిక వేత్తలకు కోపం వస్తే తన పీఠాలే కదిలిపోతాయని భావించి జైపాల్‌కు స్థానభ్రంశం కల్పించారు. అదే విధంగా గతంలో అవినీతిమయమైన విదేశాంగ శాఖ నుంచి, అలాగే ఐపీఎల్‌లో అధికార దుర్వినియోగానికి పాల్పడిన శశిధర్‌ ధరూర్‌ను ఇప్పుడు మానవ వనరుల సహాయ మంత్రి స్థానంలో కూర్చోబెట్టి అవినీతికి అందలం ఎక్కించారు. అదే విధంగా కేజ్రీవాల్‌ ఆరోపణలతో కుడితిలో పడ్డ ఎలుకలా విలవిల్లాడిన సల్మాన్‌ ఖుర్షీద్‌ను న్యాయ శాఖ నుంచి తప్పించి అంతకంటే పెద్దదైన విదేశాంగ శాఖను కట్టబెట్టడం శోచనీయం. కాస్తంత ఊరటనిచ్చే అంశమేమిటంటే మన్మోహన్‌ కేబినెట్‌లో మహిళా మంత్రుల బృందం కళకళలాడుతోంది. ఎన్నడూ లేనివిధంగా పది మంది మహిళలు కేంద్రమంత్రుల పదవుల్లో ఉండటం సంతోషించదగ్గ విషయం. ఇప్పుడు జరిగిన పునర్వ్యీవస్థీకరణలో ఒకరికి కేబినెట్‌ హోదా, ముగ్గురికి సహాయ మంత్రుల హోదా దక్కింది. అలాగే అధిష్టానం పట్ల విధేయులుగా ఉండటమేకాదు ప్రత్యర్థులను నోటికి వచ్చినట్టు తిట్టేవారికి కూడా పదవులు బాగానే దక్కాయి.పశ్చిమబెంగాల్‌లో ఆరు మంత్రివర్గ స్థానాలు ఖాళీ కాగా, మూడింటిన మాత్రమే భర్తీ చేయగలిగారు. అదీకూడా కయ్యానికి కాలుదువ్వె మమతా బెనర్జీని నోటికి వచ్చినట్టు తిట్టే దీపాదాస్‌మున్సి,  అధిర్‌ రంజన్‌ చౌదరి వంటి వారికి మంత్రి పదవులు దక్కాయి.

1996 పీవీ హయాం తరువాత పంజాబ్‌కు చెందిన పవన్‌కుమార్‌ బన్సల్‌కు రైల్వే శాఖ దక్కింది. ఈ విధంగా కేంద్రమంత్రి వర్గంలో సోనియా విధేయులకు పెద్దపీట వేసి కూర్చోబెట్టి దేశంలో పేరుకుపోయిన సమస్యలపై కాస్తంత దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం చేయడం రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం ఎలా అవుతుందో అధిష్టానానికే ఎరుక.