ఖరీప్‌ పనులు ముమ్మరం

ఆదిలాబాద్‌, జూలై 23 : వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులు, ప్రజలకు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జిల్లావ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. వర్షాలు లేక ఎండిపోయిన వాగులు, చేరువులు, ప్రాజెక్టులు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నిండిపోయి కళకళలాడతున్నాయి. ఆదివారం జిల్లాలో 26.4 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. గత రెండు రోజులుగా ఎడతెరిపగా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పలు చోట్ల వంతెనలపై నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పండి. జిల్లాలో ఇప్పటివరకు సాధరణ వర్షపాతం 432 మిల్లి మీటర్లు కాగా ఒక్క ఆదివారం రోజే 299 మిల్లి మీటర్ల వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఖరీఫ్‌ పనులు జోరు అందుకున్నాయి. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక ఆందోళనలో ఉన్న రైతులకు ఈ వర్షం ఊరటను ఇచ్చింది. సాధారణంగా జూలై రెండవ వారంలో వరినాట్లు పూర్తి చేయాల్సి ఉండగా సరిపడ వర్షాలు లేక రైతులు వరినాట్లు వేయలేదు. గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కుంటలు, చేరువులు, వాగులు నిండిపోవడంతో రైతులు వరినాట్లు నాటడంలో నిమగ్నమయ్యారు.