గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు


` ఎన్‌కౌంటర్‌ మృతుల్లో 20 మంది పురుషులు, ఆరుగురు మహిళలు
ముంబయి,నవంబరు 14(జనంసాక్షి): మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలిలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్‌ తేల్‌తుంబ్డే మృతిచెందినట్లు మహారాష్ట్ర పోలీసులు ధ్రువీకరించారు. మరణించిన 26 మంది మావోయిస్టుల్లో కూడా చాలా మందిపై క్యాష్‌ రివార్డు ఉందని తెలిపారు. ఘటనానంతరం మావోయిస్టులకు చెందిన ఆయుధాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. గడ్చిరోలి జిల్లా ధనోరా తాలూకాలోని గ్యార్‌పట్టి అడవుల్లో శనివారం మధ్యాహ్నం ఎదురుకాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 20 మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. వీరిలో 10 మంది వివరాలను ధ్రువీకరించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో తేల్‌తుంబ్డే కూడా మరణించినట్లు పోలీసులు వెల్లడిరచారు. ఆయన సహా ఆయన ఇద్దరు బాడీగార్డులు సైతం మృతిచెందినట్లు పేర్కొన్నారు.తేల్‌తుంబ్డే మృతితో మహారాష్ట్ర` మధ్యప్రదేశ్‌` ఛత్తీస్‌గఢ్‌ (ఎంఎంసీ) జోన్‌లో మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని గడ్చిరోలి రేంజ్‌ డీఐజీ సందీప్‌ పాటిల్‌ తెలిపారు. గత 20 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిస్తున్న వ్యక్తుల్లో తేల్‌తుంబ్డే ఒకరని చెప్పారు. మహారాష్ట్రలో మావోయిస్టు కార్యకలాపాల విస్తరణలో కీలక భూమిక పోషించారని చెప్పారు. మహరాష్ట్రలో ఆయన మినహా మిగతా ఎవరూ పెద్ద నాయకులు లేరని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ రిక్రూట్‌మెంట్‌లో సైతం ఆయనది కీలక పాత్ర అని, ఏళ్లుగా ఆయన కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఎల్గార్‌ పరిషద్‌ కేసులో నిందితుల్లో తేల్‌తుంబ్డే ఒకరని ఎన్‌ఐఏ గతంలో ఛార్జీషీటులో పేర్కొంది. అనిల్‌, దీపక్‌, సహ్యద్రి, కామ్రేడ్‌ ఎం పేర్లతో చలామణీ అయినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారిలో చాలా మంది మావోయిస్టులపై భారీ క్యాష్‌ రివార్డు ఉందని మహారాష్ట్ర పోలీసులు చెప్పారు. తేల్‌ తుంబ్డేపై రూ.50 లక్షలకు రివార్డు ఉందని, ఆయనతో పాటు మావోయిస్టు నంబర్‌ 4 కంపెనీ కమాండర్‌ లోకేశ్‌ అలియాస్‌ మంగు పోడ్యంపై రూ.20 లక్షల రివార్డు ఉందని చెప్పారు. డివిజనల్‌ కమిటీ సభ్యుడైన మహేశ్‌ అలియాస్‌ శివాజీరావ్‌జీ గోటాపై రూ.16 లక్షలకు రివార్డు ఉందని పేర్కొన్నారు. వీరితో పాటు పలు ఘటనల్లో నిందితులుగా ఉన్న వారిపై రూ.2 నుంచి రూ.8 లక్షల వరకు రివార్డు ఉందని చెప్పారు. పలువురు మహిళా మావోయిస్టుల విూద రివార్డు ఉందని మహారాష్ట్ర పోలీసులు వెల్లడిరచారు.