గరిష్టస్థాయికి సీలేరు జలాశయం
సీలేరు,సెప్టెంబర్1(జనం సాక్షి ): ఐదేళ్ల తర్వాత సీలేరు జలాశయ నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. నిర్విరామంగా విద్యుదుత్పత్తి చేస్తున్నప్పటికీ నీటిమట్టం తగ్గకపోవడంతో రెండు గేట్లు ఎత్తి ఆరు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. విద్యుదుత్పత్తి అనంతరం ఎనిమిది వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోందని, డొంకరాయి జలాశయం నుంచి 11 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్‌ఈ మురళీమోహన్ చెప్పారు. సీలేరు జలాశయం గేట్లు ఎత్తడంతో నీటి పరవళ్లను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. గ్యాలరీ వద్దకు చేరుకున్న యువకులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఉదయం నుంచే జలాశయం వద్ద వాహనాల రాకపోకలను నిషేధించారు. జెన్‌కో ఏఎస్‌వో డేగన్న రక్షణ సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహించారు.


