గిరిజనుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అధికారులు

ఆదిలాబాద్‌, జూలై 21: వర్షాకాలంలో జిల్లాలో వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వైద్య సిబ్బంది స్థానికంగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని ప్రకటించిన వైద్యాధికారులు జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేసులాగూడ, లింగాపూర్‌ గ్రామంలో అతిసారా సోకి ముగ్గురు మృతి చెందగా 50 మంది అస్వస్థతతో వైద్యం కోసం ఆసుపత్రిలో చేరారు. ప్రతి ఏడాది జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో మలేరియా, డయేరియా, అతిసారా తదితర వ్యాధులు సోకి పదుల సంఖ్యలో మృతి చెంది, వందలాది మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం కారణంగా గిరిజనుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రతి ఏడాది ఈ వ్యాధులపై ప్రజల్లో చైతన్యం కలిగించడం, వ్యాధి నివారణకు శాశ్వత చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు మరణిస్తున్నారు. ఈ విషయమై వివిధ రాజకీయ పార్టీలు గొంతెత్తి అరిచినా ప్రభుత్వం కానీ, జిల్లా యంత్రాంగం కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. వర్షాకాలం కంటే ముందు ఎన్నో సమావేశాలు నిర్వహించి గ్రామ సిబ్బందికి, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినా వ్యాధులను మాత్రం అరికట్టేలేకపోతున్నారు. జిల్లాలోని జైనూర్‌, నార్నూర్‌, సిరిపూర్‌, ఉట్నూర్‌ తదితర మండలాల్లో ఈ వ్యాధులకు గిరిజనులు బలవుతున్నారు. వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులను అందుబాటులో ఉంచామని వైద్య సిబ్బంది స్థానికంగా ఉంటూ గ్రామాల్లో ప్రబలిన వ్యాధులపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు సంబంధించిన సమాచారాన్ని జిల్లా కేంద్రానికి అందజేయడంతో పాటు వైద్య సేవలు అందిస్తామని ప్రకటించిన అధికారులకు అతిసారాతో ముగ్గురు మృతి చెందడం, 50 మందికి పైగా అస్వస్థతకు గురికావడంతో జిల్లాలో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకోకపోవడం, క్లోరినేషన్‌ చేయకపోవడం, మంచినీరు దొరకక కలుషిత నీటిని తాగడంతో ఈ వ్యాధులు ప్రబులుతున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.