చిట్టీ వ్యాపారిని పట్టుకోండి..న్యాయం చేయండి

పోలీసులను ఆశ్రయించిన బాధితులు
హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : చీటిల పేరిట వసూలు చేసిన డబ్బుతో ఉడాయించిన ప్రబుద్ధుడి ఉదంతం శనివారంనాడు జగద్గరిగుట్టలో వెలుగు చూసింది. స్థానికుల, బాధితుల కథనం ప్రకారం.. కుమార్‌ అనే వ్యాపారి చిట్టీలు నిర్వహించేవాడని, ఖాతాదారుల నుంచి సుమారుగా 40 లక్షల రూపాయలు వసూలు చేశాడని, ఎవరికీ చెప్పకుండానే ఉడాయించాడని అన్నారు. జీడిమెట్ట పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. అక్కరకు వస్తాయని, పిల్ల పెళ్లికో.. ఇల్లు కట్టుకునేందుకో.. పిల్లాడి ఫీజుకు పనికి వస్తుందన్న ఆశతో చిట్టీలు వేస్తే తమ సొమ్ముతో చడీచప్పుడు లేకుండా ఉడాయించాడని కొందరు బాధితులు ఆవేదన చెందారు. చిట్టీల వ్యాపారి ఆచూకీ తెలుసుకుని తమ సొమ్ము తమకు అప్పగించాలని బాధితులను పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు చిట్టీ వ్యాపారి కోసం గాలింపు చేపట్టారు.