జలాశయాలు కళకళ!

హైదరాబాద్‌,జూలై 29 (జనంసాక్షి) : రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నా యి. గోదావరి బ్యారేజి వద్ద నీరు 9.20 అడుగులకు చేరుకుంది. వరద నీటిని సముద్రంలోకి వదిలివేశారు. దీంతో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ప్రకాశం బ్యారేజి వద్ద నీరు 11.2 అడుగులకు చేరింది. ఇప్పటికే డెల్టా ప్రాంతానికి నీరు వదిలారు. అలాగే నాగార్జునసాగర్‌ నీటి మట్టం 590 అడుగులు కాగా నీరు 511 అడుగులకు చేరింది. అలాగే జూరాల ప్రాజెక్టు సామర్ధ్యం 1045 అడుగులు కాగా 1030 అడుగులకు నీరు చేరినట్టు నమోదైంది. సింగూరు జలాశయం పూర్తి సామర్ధ్యం 1717 అడుగులు కాగా 1700 అడుగులకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు సామర్ధ్యం 885 అడుగులు కాగా 794 అడుగులకు నీరు చేరింది. జలాశయాలన్నీ నీటితో కళకళలాడుతుండడం పట్ల ప్రజలు హర్షాతీరేకం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక రైతులు ఇప్పటికే పొలం పనుల్లో తలమునకలై ఉన్నారు. ఇదిలా ఉండగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. చత్తీస్‌గడ్‌ నుంచి తమిళనాడు వరకు కొనసాగుతోంది. 24 గంటల్లో తెలంగాణ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.