జోరువాన.. హోరు చలి..
– వెనకకు తగ్గని రైతులు
– నేడు ఏడోదశ చర్చలు
– చట్టాలు రద్దు చేసే వరకు పోరు ఆగదు
– రైతు సంఘాలు
దిల్లీ,జనవరి 3(జనంసాక్షి):చలి.. వర్షం.. ప్రకృతిలో భాగమైన ఈ రెండూ రైతన్నకు నేస్తాలే. పంటను చేతికందించడంలో అన్నదాతకు సహకరించేవే. కానీ, రెండూ ఏకమై వచ్చినా దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతన్నను మాత్రం కదిలించలేకపోయాయి. కొత్త సాగు చట్టాల రద్దే లక్ష్యంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 39వ రోజుకి చేరింది. సింఘు, టిక్రీ, ఘాజీపూర్, చిల్లా, పల్వాల్ సరిహద్దుల వద్ద రైతుల నిరసన కొనసాగుతోంది. ఓవైపు వణికించే చలికి నేటి తెల్లవారుజాము నుంచి వర్షం కూడా తోడైంది. అయినా రైతులు లెక్కచేయడం లేదు. గుడారాల్లోకి చేరి తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చట్టాల రద్దు చేసే వరకు నిరసన ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు.మరోవైపు సోమవారం కేంద్రంతో రైతు సంఘాల ఏడో దఫా చర్చలు జరగనున్నాయి. సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధతపై చర్చించనున్నారు. ఈసారి చర్చలు సఫలం కాకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని రైతులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే జనవరి 6న ట్రాక్టర్ల ర్యాలీ, జనవరి 26న ట్రాక్టర్లతో కవాతు నిర్వహించాలని నిర్ణయించారు.ఇదిలా ఉండగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజధానిలో కొనసాగుతున్న రైతు నిరసనలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సత్యాగ్రహ ఉద్యమంతో పోల్చారు. దిల్లీ నిరసనల్లో పాల్గొన్న ప్రతిఒక్కరూ దేశభక్తుడైన సత్యాగ్రహియే అని ఆయన తన ట్విటర్లో పేర్కొన్నారు. భారత స్వతంత్య్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన నాటి చంపారన్ తరహా సంఘటన.. దేశంలో మరోసారి చోటుచేసుకోనున్నాయని కాంగ్రెస్ నేత అభిప్రాయపడ్డారు. నాటి స్వతంత్య్ర సమరంలో బ్రిటిష్ కంపెనీకి బలం ఉండగా.. ఇప్పుడు మోదీ మిత్రులైన కంపెనీకి బలం ఉందని ఆయన విమర్శించారు. ఐతే, నేటి ఉద్యమంలో ప్రతి రైతు, రైతుకూలీ కూడా సత్యాగ్రహి అని.. వారు తమ హక్కును పొందే తీరుతారని రాహుల్ గాంధీ అన్నారు.నామమాత్రపు ప్రతిఫలానికి రైతులు తమ పొలాల్లో నీలిమందు పండిచాలన్న బ్రిటిష్ వారి నిర్బధానికి వ్యతిరేకంగా.. బిహార్లోని చంపారన్ ప్రాంత రైతులు తొలిసారి సత్యాగ్రహం చేశారు. ఈ చారిత్రాత్మక సంఘటన 1917లో మహాత్మాగాంధీ నాయకత్వంలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుత వ్యవసాయ చట్టం పంటలను, రైతును సర్వనాశనం చేస్తుందని.. దానిని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దిల్లీ రైతు నిరసనలకు ఈ పార్టీ తమ పూర్తి మద్దతు ప్రకటించింది. రాజధాని సరిహద్దుల్లో కొనసాగుతున్న ఈ ఆందోళన నేటితో 39వ రోజుకు చేరింది. జనవరి నాలుగో తేదీ, సోమవారం రైతులు-కేంద్రం మధ్య ఏడో దఫా చర్చలు జరగనున్నాయి.