టిడిపి, వైఎస్‌ఆర్ సిపి, కాంగ్రెస్ నాయకులను – తెలంగాణపై నిలదీయాలి : శ్రీహరిరావు
ఆదిలాబాద్, డిసెంబర్ 8): గ్రామాల్లోకి వస్తున్న టిడిపి, వైఎస్‌ఆర్ సిపి, కాంగ్రెస్ నాయకులను తెలంగాణపై నిలదీయాలని జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీహరిరావు పిలుపునిచ్చారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా నిర్మల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వస్తేనే సమస్యలన్ని పరిష్కారమవుతాయని ఈ దిశగా రాష్ట్రం వచ్చే వరకు ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా రాజీలేని పోరాటం చేయాలన్నారు. తెలంగాణ అంశంపై అన్ని పార్టీలు చేస్తున్న మోసాలపై నాయకులను నిలదీసి గ్రామాల్లో పర్యటించకుండా చూడాలని అన్నారు. కాగా పల్లెబాట కార్యక్రమంలో ాభాగంగా 4వ రోజు శనివారం జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి తెలంగాణ ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగిన పల్లెబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న, సిర్‌పూర్ నియోజకవర్గంలో సమయ్య, చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఓదేలు పాల్గొన్నగా ఇతర ప్రాంతాల్లో ఆ పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు.