టీఆర్‌ఎస్‌ సభ అట్టర్‌ ప్లాప్‌

– రెండు లక్షలకు మించి జనాలు రాలేదు
– మైనార్టీ రిజర్వేషన్‌లపై ఢిల్లీలో భూకంపం ఏమైందో కేసీఆర్‌ చెప్పాలి
– కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ
హైదరాబాద్‌, సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి) : టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ వ్యాఖ్యానించారు. సోమవారం ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన సభతీరు, కేసీఆర్‌ ప్రసంగంపై తీవ్ర స్థాయాలో మండిపడ్డారు. సభ అట్టర్‌ప్లాప్‌ కావడంతో కేసీఆర్‌ నిరాశ చెందారని, సభకు రెండు లక్షలకు మించి జనాలు రాలేదని అన్నారు. రూ.300 కోట్లు ఖర్చు పెట్టినా ప్రజల నుంచి స్పందన కరువైందని విమర్శించారు. కేసీఆర్‌ సభలో ప్రస్తుత హావిూల అమలుపై మాట్లాడకుండానే, తెలంగాణ నేనే తెచ్చానని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందని అన్నారు. సభలో మూడెకరాల భూ పంపిణీ, డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల గురించి ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. మైనార్టీ రిజర్వేషన్‌పై ఢిల్లీలో భూ కంపం ఏమైందని నిలదీశారు. తమ అధిష్టానం ఢిల్లీలోనే ఉందని.. అయితే కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లి మోదీ కాళ్లు ఎందుకు మొక్కుతున్నారని ప్రశ్నించారు. సభ ఫెయిల్‌ అయింది కాబట్టి కేసీఆర్‌ ముందుస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చని షబ్బీర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఓట్ల కోసమే కేసీఆర్‌ కొంగజపం చేశారు – పొన్నాల లక్ష్మయ్య
ఓట్ల కోసమే కేసీఆర్‌ కొంగరకలాన్‌లో కొంగ జపం చేశారని కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్యయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ..  కేసీఆర్‌ చేసిన ప్రగతిలేదు.. సభలో నివేదన లేదని వ్యాఖ్యానించారు. విద్యుత్‌ గురించి గొప్పగా చెబుతున్న కేసీఆర్‌ ఒక్క మెగావాట్‌ విద్యుత్‌ను అయినా ఉత్పత్తి చేశారా అంటూ ప్రశ్నించారు. ఒక్క కొత్త ప్రాజెక్టునైన ప్రారంభించారా? అని ప్రశ్నించారు. ఢిల్లీకి చెంచాగిరి చేస్తున్నది కేసీఆరే అని లక్ష్మయ్య దుయ్యబట్టారు. ఎందుకు పదే పదే ఢిల్లీకి వెళ్తున్నారని నిలదీశారు. ఎన్నికలకు కాంగ్రెస్‌ ఎప్పుడు భయపడదని స్పష్టం చేశారు. ఎన్నికలు సమయానికి వస్తే ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్‌ ముందస్తు డ్రామాలు ఆడుతున్నారని పొన్నాల ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ కేసీఆర్‌ లాంటి వారిని ఎందరినో చూసిందని, ఎన్నికలంటే కాంగ్రెస్‌కు కొత్త కాదని, ఎప్పుడు ఎన్నికలొచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.