డ్వాక్రా,రైతు రుణమాఫీపై ఎపి అసెంబ్లీలో చర్చకు పట్టు

పోడియం వద్ద వైకాపా ఆందోళన…సభ 15 నిముషాలు వాయిదా
హైదరాబాద్‌,మార్చి26  (జ‌నంసాక్షి)  : డ్వాక్రా,రైతు రుణమాఫీపై ఎపి అసెంబ్లీలో మరోమారు వైకాపా చర్చకు పట్టుబట్టింది. దీనిపై చర్చించాలని ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ కోడెల తిరస్కరించారు. గతంలో దీనిపై చర్చించామని అన్నారు. మళ్లీ అదే ప్రశ్నపై చర్చించడం సరికాదన్నారు. ఈ అంశంపై ఇప్పటికే చర్చ జరిగిందని అన్నారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే రైతులు, డ్వాక్రా సంఘాల రుణమాఫీపై వైకాపా ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని కోరుతూ వైకాపా సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ… రైతు రుణమాఫీపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. మళ్లీ అదే అంశంపై వైకాపా సభ్యులు చర్చకు పట్టుబట్టడం సమంజసం కాదన్నారు. సభలో ఇప్పటి వరకు ఏం జరిగిందో ప్రతిపక్షం తెలుసుకోవాలని సూచించారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్ష సభ్యులు సహకరించాలని కోరారు. ఏ అంశంపై చర్చించాలో కూడా వారికి తెలియదన్నారు.

కావాలనే సభా సమయం వృధా చేస్తున్నారని అన్నారు. సమయం ఇస్తే సంబంధం లేకుండా సబ్జక్ట్‌పై మాట్లాడుతున్నారని స్పీకర్‌ కోడెల అన్నారు. అయితే  రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీపై చర్చించేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం పట్ల ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులు, డ్వాక్రా  మహిళల సమస్యలపై కచ్చితంగా చర్చించాల్సిందేనని ఆయన పట్టుబట్టారు.  చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే అబద్ధాలేనని అన్నారు. రైతులు ఎట్లా పోయినా ప్రభుత్వానికి ఫరవాలేదనట్లుగా ప్రభుత్వ తీరు ఉందన్నారు.  రుణమాఫీపై చర్చ అయిపోయింది… సీఎం స్టేట్‌ మెంట్‌ ఇచ్చేసారు అని చెబుతున్నారని, ప్రతిపక్షం సభలో లేకుండానే …విూకు విూరే మాట్లాడుకుని, విూకు విూరు అనుకుని చర్చ అయిపోయిందనటం సరైన పద్ధతేనా అని అడిగారు. అయిదు కోట్ల మంది అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారని, రుణమాఫీ, డ్వాక్రా రుణాలపై చిత్తశుద్ధి ఉంటే చర్చకు అవకాశం ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా స్పీకర్‌ ను కోరారు. చర్చకు ఎందుకు ప్రభుత్వం భయపడుతుందో అర్థం కావటం లేదన్నారు. ప్రజా సమస్యలు మాట్లాడటానికే అసెంబ్లీ ఉందని, డ్వాక్రా, రైతు రుణమాఫీ కంటే పెద్ద సబ్జెక్ట్‌ ఏముందని వైఎస్‌ జగన్‌ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కేటాయింపులు వడ్డీలకే సరిపోవటం లేదన్నారు. ఓవైపు బ్యాంకులు రుణాలు ఇవ్వక, మరోవైపు అప్పులు పుట్టక రైతులు అల్లాడుతున్నారన్నారు.  రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. దీంతో సభలో వైకాపా ఆందోళనకు దిగారు. ఈ నుపథ్యంలో సభను స్పీకర్‌ 15 నిముషాలు వాయిదా వేశారు.