తాలిబన్లకు సవాల్‌ విసురుతున్న పంజ్‌షీర్‌


దాదాపు 300మంది తాబిన్లను మట్టుపెట్టినట్లు ప్రకటన
ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న అహ్మద్‌ షా మసూద్‌ నాయకత్వం
కాబూల్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): అప్గన్‌ను ఆక్రమించిన తాలిబన్లను.. పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ మాత్రం కలవర పెడుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అప్గన్‌ను ఆక్రమించిన తాలిబన్లు.. తమను సవాలు చేస్తున్న పంజ్‌షీర్‌ లోయ ఆక్రమణకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆక్రమణకు యత్నించిన తాలిబన్లను.. పంజ్‌షీర్‌ సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు పంజ్‌షీర్‌ సైన్యం ప్రకటించినట్లు అంతర్జాతీయ విూడియా ప్రకటించింది. బాగ్లాన్‌, అంద్రాబ్‌ ప్రాంతాలు తిరిగి కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఇక తాలిబన్లు భారీ ఆయుధాలతో పంజ్‌షీర్‌ వైపు కదులుతున్నట్లు సమాచారం. అంతేకాక పలువురు తాలిబన్లను అరెస్ట్‌ చేసినట్లు అంతర్జాతీయ విూడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని పంజ్‌షీర్‌ ప్రజలు ప్రకటించారు. పంజ్‌షీర్‌ లోయలోకి వెళ్లే మార్గాల్లో ఎక్కడికక్కడ గట్టి పహారా ఏర్పాటు చేశారు. తాలిబన్లను ఎదుర్కొని.. వారిని ఢీకొడుతున్న పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తాలిబన్ల చెర నుంచి అప్గన్‌ను విముక్తి చేసేది అహ్మద్‌ షా మసూద్‌ నాయకత్వంలోని పంజ్‌షీర్‌ సైన్యమే అని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. అఫ్గానిస్తాన్‌ ప్రస్తుత జనాభా 3.80కోట్ల పైమాటే. తాలిబన్ల సంఖ్య కేవలం
లక్షలోపే. దేశంలో కొన్ని ప్రాంతాలు ఇంకా వారి నియంత్రణలోకి రాలేదు. మారుమూల ప్రాంతాల్లో వార్‌లార్డ్స్‌ పెత్తనం సాగిస్తు న్నారు. సొంతంగా ప్రైవేట్‌ సైన్యాలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి వారిని అణచివేసి, దేశం మొత్తాన్ని తమ పరిధిలోకి తీసుకురావాలంటే తాలిబన్లు తమ బలం, బలగాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. తుపాకులు పట్టి శత్రువులపై పోరాడడం తప్ప ప్రజలకు సుపరిపాలన అందించడం తాలిబన్లకు పెద్దగా అలవాటు లేదు. చెప్పుకోదగ్గ ఆధునిక సదుపాయాలు లేని అప్గాన్‌ను పాలించడం కష్టమైన పనేనని సాక్షాత్తూ ప్రభుత్వ అధికారులే అంటున్నారు. ప్రభుత్వాన్ని నడిపించడానికి తగిన యంత్రాంగం కూడా అప్గాన్‌లో లేదు. పునాదుల నుంచి నిర్మించుకుంటూ రావాల్సిందే. 1996` 2001 వరకూ దేశాన్ని పాలించినప్పుడు తాలిబన్లు అరాచకానికి మారుపేరుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడైనా తీరు మార్చుకోకపోతే జనం తిరగబడ డానికి ఎక్కువ సమయం పట్టదు. 20 ఏళ్ల తర్వాత దేశాన్ని మళ్లీ ఆక్రమించుకున్న తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, ప్రజలపై తమ పాలన రుద్దడానికి సన్నద్ధమవుతున్నారు. త్వరలోనే కొలువుదీరనున్నారు. తాలిబన్‌ కమాండర్లే ఇక గవర్నర్లు, మేయర్లుగా అవతారం ఎత్తుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, కల్లోలిత అఫ్గాన్‌ పాలన అనుకున్నంత సులభం కాదని, తాలిబన్ల కోసం ఎన్నో సవాళ్లు ఎదురు చూస్తున్నాయని నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు.