‘తెలంగాణ’కు ప్రజలదే నాయకత్వం

తెగించి కొట్లాడుదాం.. తెలంగాణ సాధిద్దాం
రాజకీయ నాయకత్వానికి బుద్ధిచెబుదాం
తెలంగాణ ఇస్తామని పోటీ చేసిన ఎంపీలు
ఇప్పుడు వద్దంటే ప్రజలు తరిమి కొడతారు
జేఏసీ చైర్మన్‌ కోదండరాం
నల్గొండ  14 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకత్వం ఇక్కడి ప్రజలదేనని, అకుంఠిత దీక్షతో ఉద్యమిస్తే ప్రత్యేక రాష్ట్రం రాకమానదని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో మంగళవారం జరిగిన పలు కార్యక్రమా ల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెగించి కొట్లాడి తెలంగాణ సాధించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఇస్తామని హామీలిచ్చి, ఇప్పుడు గెలిచాక పదవులు అనుభవిస్తున్న తెలంగాణ ఎంపీలు ఇక్కడి ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు రాజీనామా చెయ్యాలని, అలా చేస్తే కేంద్రంలో తప్పక కదలిక వస్తుందని కోదం డరాం అభిప్రాయపడ్డారు. టీఎంపీలు చిత్తశుద్ధితో కొట్లాడితే తెలంగాణ తప్పక వచ్చేదని, ఆ చిత్తశుద్ధి తెలంగాణ రాజకీయ నాయకుల్లో లేకనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టీఎంపీలు పార్టీలకతీతంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ొట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వారి స్ఫూర్తిగా ప్రత్యేక రాష్ట్రం సాధిస్తామని ప్రతిజ్ఞ చేయాలన్నారు. అదే జిల్లాలో ఆర్‌ఎంపీ, పీఎంపీ డాక్టర్ల మహాసభల్లోనూ పాల్గొన్న కోదండారాం మాట్లాడుతూ ఆర్‌ఎంపీ, పీఎంపీలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. కొన్నేళ్ల కింద వీళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం ఆ తరువాత ఆపేసిందని, మళ్లీ వైఎస్సార్‌ హయాంలో ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణనిచ్చి, గ్రామాల్లో వైద్య సేవలకు వినియోగించుకోవాలని భావించి జీవోను కూడా విడుదల చేసిన ప్రభుత్వం ఆ శిక్షణను మధ్యలోనే ఆపేసిందన్నారు. తెలంగాణ మొత్తంలో 60 వేల మంది ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ఉన్నారని, ప్రభుత్వం శిక్షణను కొనసాగించి ఉంటే ఇంత మంది బాగు పడేవారని, అదే విధంగా గ్రామస్థాయిలో ఆరోగ్య సమస్యలు చాలా వేగంగా పరిష్కారమయ్యేవని వివరించారు. ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు శిక్షణనిస్తే ఎయిడ్స్‌, కుష్ఠు తదితర రోగాలపై కూడా గ్రామీణ ప్రజల్లో అవగాహన పెరుగుతుందన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఆర్‌ఎంపీలు, పీఎంపీలుగా స్వయం ఉపాధి పొందుతున్న నిరుద్యోగులను ప్రోత్సహిస్తే, గ్రామాల ప్రజలు పీహెచ్‌సీలకు వెళ్లాల్సిన అవసరం రాదన్నారు. ఫలితంగా, ఇటు ప్రజలకు, అటు ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు లాభం చేకూరుతుందని కోదండరాం వివరించారు. తెలంగాణ వస్తే ఈ విధానాలన్నీ తప్పక అమలవుతాయని ఆయన వివరించారు. ఆర్‌ఎంపీలు, పీఎంపీలు కూడా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారని, ఇదే ఉత్సాహాన్ని సెప్టెంబర్‌ 30న నిర్వహించే తెలంగాణ మార్చ్‌లోనూ కనబర్చాలని కోరారు. కొందరు సీమాంధ్ర నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు గందరగోళాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ కుట్రలను తిప్పికొట్టేలా తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని కోదండరాం పునరుద్ఘాటించారు.