తెలంగాణపై త్వరలోనే శాశ్వత పరిష్కారం ఎంపి మందా జగన్నాధం

రాహుల్‌తో పాలడుగు భేటీ
న్యూఢిల్లీ, జూలై 10 : తెలంగాణ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించగలదని నాగర్‌కర్నూలు ఎంపి మందా జగన్నాథం అన్నారు. మంగళవారంనాడు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ఎఐసిసి ప్రత్యేకంగా ఒక నివేదికను తెప్పించుకుందని, దీనిపై అధిష్టానం అధ్యయనం చేస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల అనంతరం తెలంగాణపై అధిష్టానం దృష్టి సారిస్తుందని చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, కార్యదర్శి రాహుల్‌గాంధీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, రాష్ట్రపతి ఎన్నికల హడావుడి పూర్తవ్వగానే వీటిపై ఒక నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. రాష్ట్ర రాజకీయాలపై కూడా వీరిరువురు ఇప్పటికే దృష్టి సారించారని, వివిధ కోణాల నుంచి వివిధ మార్గాల్లో సమాచారాన్ని తెలుసుకుంటూ దాన్ని క్రోడీకరించే పనిలో నిమగ్నమై ఉన్నారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సానుకూల నిర్ణయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం కొందరి కుట్ర వల్లే తెలంగాణ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని మందా వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఏర్పడక తప్పదన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణకే తాను సానుకూలమని చెప్పారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించబోమని చెప్పారు. ఇదిలా ఉండగా ఎఐసిసి కార్యదర్శి రాహుల్‌గాంధీ మంగళవారంనాడు ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావుతో భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై ఆయన అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోని ఉభయ ప్రాంతాల నేతలతో రాహుల్‌గాంధీ విడివిడిగా భేటి అవుతూ పలు అంశాలపై సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. తెలంగాణ అంశంతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిస్థితిని ఆయన ప్రత్యేకంగా అడిగి తెలుసు కుంటున్నారు. దీన్ని బట్టి ఆయన రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారనే విషయం అర్ధమవుతోంది.