తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై మళ్లీ పోరాటం : స్వామిగౌడ్‌

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై మళ్లీ పోరాటానికి శ్రీకారం చుట్టనున్నట్టు టీఎన్జీవో జేఏసీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన జస్టిస్‌ రాయకోటి కమిషన్‌ను కలిశారు. అనంతరం స్వామిగౌడ్‌ విలేకరులతో మాట్లాడారు.తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై మళ్లీ పోరాటం చేపట్టనున్నామని, ఇందుకు సంబంధించిన ఉద్యమ కార్యాచరణను ఈనెల 26న నిర్వహించే సమావేశంలో చర్చించి రూపొందిస్తామన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పోస్టులన్నీ ఆంధ్రోళ్లతో నింపుతున్నారని స్వామిగౌడ్‌ ఆరోపించారు. 120 శాఖలను కమిషనరేట్ల పేరుతో రెగ్యులరైజేషన్‌ చేసేందుకు కుట్రపన్నుతున్నారని ఆయన ఆరోపించారు. దీంతో తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. 610 జీవో అమలు కావడంలేదని, ఏ శాఖలోనూ ఈ జీవో అమలుకునోచుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఇతర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు తమ బదిలీలపై స్టే తెచ్చుకుని ఇక్కడే తిష్టవేసినా స్టే ఎత్తివేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం లేదని స్వామి గౌడ్‌ విమర్శించారు. సీమాంధ్రు ఉద్యోగుల హితం కోసమే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన ఆరోపించారు. స్టే ఎత్తివేతకు ప్రయత్నించకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.