దొంగతనంలో ఆరితేరిన తోటమాలి
నమ్మకంగా పనిచేస్తూ తిన్నింటికే కన్నం వేశాడు
బంగారు నగలను మాయం చేసిన సురేశ్ అరెస్ట్
హైదరాబాద్,ఆగస్ట్14(జనం సాక్షి): నమ్మకంతో చేరదీసి ఇంటిపని అప్పగిస్తే పనిచేస్తున్న ఇంటికే కన్నం వేశాడో ప్రబుద్దుడు. నమ్మకంగా ఉన్నట్లు ఉంటూనే మెల్లగా చేతివాటం ప్రదర్శించాడు. అయితే ఆసల్యంగా అయినా అతని దొంగబుద్దికి చెక్ పడక తప్పలేదు. ఓ వ్యాపారి ఇంటిలొ తోటమాలిగా పనికి కుదరిన వ్యక్తి నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించేవాడు. కంటి ముందు నగలు కనిపిస్తే చాలు.. వాటిని ఇట్టే మాయం చేసేవాడు. అలా ఆ తోటమాలి కోటి రూపాయలు విలువైన నగలను ఇంటియజమాని భవనం నుంచి దోచుకెళ్లాడు. పోలీసులు వలపన్ని అతడిని పట్టుకున్నారు. పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-4లో నివసిస్తున్న సాయిరాం క్యాపిటల్ వెంచర్స్ పేరిట వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ఆయన ఇంట్లో 20 మంది వరకు పనివారు ఉన్నారు. వీరిలో మహబూబాబాద్ జిల్లా నర్సంపేటలోని రూపాల తండాకు చెందిన గుగులోతు సురేశ్ తోటమాలిగా నాలుగేళ్ల నుంచి పనులు చేస్తున్నాడు. సురేశ్ ఐదు నెలల క్రితం వివాహం చేసుకోగా ఇంటి యజమాని అతడికి ప్రత్యేకంగా ఓ గది కూడా కేటాయించారు. ఇదే అదునుగా.. యజమాని నమ్మకాన్ని అతడు సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. తొలుత నాలుగు ఖరీదైన వాచ్‌లను, 23 రకాల నగలను చోరీ చేశాడు. వాటిని సొంత గ్రామానికి తీసుకెళ్లి తండ్రి వద్ద దాచి అక్కడే కొన్నిరోజులు ఉండి నగలను ముక్కలుగా చేసి బంధువులకు పంచాడు. తాను వచ్చి అడిగినప్పుడు ఇవ్వాలని బంధువులకు షరతు పెట్టేవాడు.
తర్వాత పనిచేసే బంగ్లాకు వచ్చి ఏవిూ తెలియనట్లుగా నటించేవాడు. ఇటీవల సాయిరాం ఇంటికి చెన్నై నుంచి మేనల్లుడు ప్రశాంత్ వచ్చాడు. 20 రోజుల పాటు ఉండి తిరిగి వెళ్లిపోయాడు. చెన్నైకి వెళ్లాక అతడి నిశ్చితార్థ ఉంగరం కనిపించలేదు. సాయిరాంకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఉంగరం కోసం సాయిరాం ఇంట్లో వెతకగా.. తమకు సంబంధించిన నగలు కూడా కనిపించలేదు. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానంతో సురేశ్‌ను విచారించగా గుట్టురట్టయింది. నిందితుడి నుంచి 87 తులాల బంగారు, వజ్రాభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



