నాణ్యమైన భోజనం పెట్టకపోతే జైలుకువెళ్తారు జాగ్రత్త!

` సంక్షేమానికి కులగణన ఎందుకవసరమో విద్యార్థులు విప్పిచెప్పండి
` రూ.5వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు నిర్మిస్తాం
` ఎంతచేసినా పిల్లలను ప్రభుత్వ బడులకు పంపడానికి ఇష్టపడట్లేదు
` పాఠశాలల ప్రతిష్ట పెంచే బాధ్యత టీచర్లదే.
` విద్యార్థుల కలలను నిజం చేస్తాం
` ‘జాతీయ బాలల దినోత్సవం’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):విద్యార్థుల కలలను నిజం చేయడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. ’’రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి బాలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. జవహర్‌లాల్‌ నెహ్రూ భారత తొలి ప్రధానే కాదు.. దేశాన్ని ప్రపంచం ముందు గొప్పగా చూపించిన నేత. నవీన భారత రూపశిల్పి నెహ్రూ. రూ.5వేల కోట్లతో రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు నిర్మిస్తాం. ఇటీవలే హాస్టల్‌ విద్యార్థులకు ఇచ్చే డైట్‌, కాస్మోటిక్‌ ఛార్జీలు పెంచాం. రాష్ట్రంలో గత పదేళ్లలో 5వేల పాఠశాలలు మూతపడ్డాయి. బడ్జెట్‌లో 7 శాతానికి పైగా నిధులు విద్యాశాఖకు కేటాయించాం. ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించాలని పదోన్నతులు ఇచ్చాం, బదిలీలు చేశాం. 11,062 టీచర్‌ పోస్టులు భర్తీ చేశాం. టీచర్‌ పోస్టుల భర్తీ ద్వారా విద్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నిరూపించాం’’ అని సీఎం తెలిపారు.’’ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. వర్సిటీలకు ఉపకులపతులను నియమించాం. విద్యా వ్యవస్థను బాగు చేసేందుకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. ప్రభుత్వ టీచర్లకు ఉన్న అర్హత ప్రైవేటు ఉపాధ్యాయులకు లేదు. అయినా పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించడానికి ఇష్టపడట్లేదు. ప్రభుత్వ బడుల ప్రతిష్ట పెంచే బాధ్యత టీచర్లదే. ప్రజాప్రతినిధులు గ్రామాల్లో విద్యార్థులను కలిసి సమస్యలు తెలుసుకోవాలి. నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 7 వరకు విజయోత్సవాలు నిర్వహిస్తున్నాం. అనుకున్న విధంగా బాలల దినోత్సవం రోజున ఉత్సవాలు ప్రారంభించాం.
నాణ్యమైన భోజనం పెట్టకపోతే జైలుకు పంపుతాం
అధికారులు జిల్లాల్లో రెండు రోజుల పాటు పాఠశాలలను పర్యవేక్షించాలి. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలి. హాస్టల్‌ విద్యార్థులకు సన్నబియ్యంతో మంచి అన్నం పెట్టాలి. దొడ్డు బియ్యం, కుళ్లిన కూరగాయలతో భోజనం పెడితే ఊరుకునేది లేదు. హాస్టల్‌ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే జైలుకు పంపుతాం. గత సీఎంను ఏనాడైనా విూరు (విద్యార్థులను ఉద్దేశించి) చూశారా? మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను ఏనాడైనా చూశారా? ఈ రోజు విూ రేవంత్‌ అన్న విూతో చేయి కలిపాడా.. లేదా? దేశానికి ఆదర్శంగా ఉంటామని.. ఎలాంటి చెడు వ్యసనాలకు బానిసలు కాబోమని విద్యార్థులు ప్రమాణం చేయాలి’’ అని సీఎం కోరారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

 

చట్టసభలకు పోటీచేసే వయసు 21కి తగ్గించాలి
` ఈ దిశగా చట్టసవరణ జరగాలి
` విద్యార్థుల మాక్‌ అసెంబ్లీలో సిఎం రేవంత్‌ రెడ్డి
హైదరారాబాద్‌(జనంసాక్షి):ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఓటింగ్‌ వయసును 18 ఏల్లకు తగ్గించిన క్రమంలో పోటీ చేసే వయసును కూడా తగ్గించే అవకాశాన్ని పరిశీలించాల్సి ఉందని అన్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఎన్‌సీఈఆర్‌టీలో విద్యార్థులు నిర్వహించిన అండర్‌-18 మాక్‌ అసెంబ్లీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయాలంటే 25 ఏళ్లు నిండాలనే నిబంధన ఉంది. ఓటు హక్కు పొందేందుకు వయోపరిమితి 21 సంవత్సరాల నుంచి 18ఏళ్లకు తగ్గించారు. కానీ, ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయడానికి 25 ఏళ్ల వయసు ఉండాలనే నిబంధనను మాత్రం సవరించలేదు. ఈ నిబంధనను కూడా సవరించుకుని .. 21 ఏళ్లు నిండిన వారు శాసనసభకు పోటీ చేసే అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి. తద్వారా యువత చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుంది. 21 ఏళ్లు నిండిన వారు ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా పనిచేస్తున్నప్పుడు… 21 ఏళ్లు నిండిన వారు శాసనసభ్యులుగా కూడా రాణిస్తారని బలంగా నమ్ముతున్నా. మాక్‌ అసెంబ్లీ తీర్మానాల్లో ఈ అంశాన్ని కూడా చేర్చి రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పంపించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా‘ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందులోభాగంగా మాట్లాడుతూ ఇలాంటి సమావేశాలు సమాజానికి చాలా అవసరం అని అన్నారు. అలాగే శాసన సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు… ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలని సూచించారు. విపక్షాలు ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం వారి బాధ్యతని గుర్తు చేశారు.లీడర్‌ ఆఫ్‌ ది హౌస్‌, లీడర్‌ ఆఫ్‌ ది అపొజిషన్‌ ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయని, సభను సమర్ధవంతంగా నడిపే బాధ్యత స్పీకర్‌ పై ఉంటుందని అన్నారు. అలాగే విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాలని కానీ దురదృష్టవశాత్తు ఈరోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలా అనే విధంగా చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. మాక్‌ అసెంబ్లీని స్ఫూర్తిదాయకంగా నిర్వహించిన విూ అందరినీ అభినందిస్తున్నానని అన్నారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ ఎడ్యుకేషన్‌, అగ్రికల్చర్‌ రెవల్యూషన్‌ తీసుకొచ్చారని, వారి వల్లే మనకు సమాజంలో ఇవాళ అవకాశాలు వచ్చాయని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. దేశంలో నిర్బంధ విద్య అమలు చేసేందుకు సోనియా గాంధీ, మన్మోహన్‌ ఎంతో సింగ్‌ కృషి చేశారని 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కును అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత రాజీవ్‌ గాంధీ గారిది అని ప్రశంసించారు. ఇక ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసేందుకు 25 ఏళ్ల వయసు నిబంధన ఉందని, 21 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తే యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని విద్యార్థులకి తెలిపారు. మాక్‌ అసెంబ్లీలో ఇలాంటి బిల్స్‌ ను పాస్‌ చేయడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమాన్ని ప్రజలకు వివరించండి
` ‘ప్రజాపాలన`విజయోత్సవాలు’ విజయవంతంగా నిర్వహించాలి
` కార్యక్రమంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రజాపాలన`విజయోత్సవాలపై అధికారులతో ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమపథకాల గురించి ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. .డిసెంబర్‌ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలపై చేపట్టే కార్యక్రమాలను అధికారులు సీఎం వివరించారు. విజయోత్సవాలలో భాగంగా వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో ఏర్పాటు చేసే బహిరంగసభల్లో సీఎం పాల్గొననున్నారు. మహిళల సాధికారత, రైతుల సంక్షేమం, యూత్‌ ఎంపవర్‌ మెంట్‌ కు సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 19న వరంగల్‌ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్న సీఎం.డిసెంబర్‌ 7,8,9 తేదీల్లో హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌, సెక్రెటేరియట్‌, నెక్లెస్‌ రోడ్‌ పరిసరాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయం.ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం.డిసెంబర్‌ 9న సెక్రెటరియట్‌ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్న సీఎం.తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని నిర్ణయం.శాఖలవారీగా, విభాగాల వారీగా ప్రభుత్వం తొలి ఏడాదిలో సాధించిన విజయాలను, చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం అధికారులకు సూచించారు.