నిండు సభలో నిర్వాసితుల సమస్యలపై

అంగీ చింపుకున్న జార్ఖండ్‌ ఎమ్మెల్యే

సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి): నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఓ ఎమ్మెల్యే జార్ఖండ్‌ అసెంబ్లీలో వీరంగం సృష్టించాడు. తన డిమాండ్ల కోసం పట్టుబడుతూ శాసనసభలో ఆయన చొక్కా చించేసుకున్నాడు. ఈ సంఘటనతో శానససభ రెండు సార్లు వాయిదా పడింది. తన నియోజకవర్గం బొకారోలో పేదల పునరావాసానికి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ సమ్రేష్‌ సింగ్‌ అనే శాసనసభ్యుడు చొక్కా చెంపేసుకున్నారు. బొకారో ఉక్కు కర్మాగారం వల్ల నిరాశ్రయులైన పేదల పునరావాసానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. జెవిఎం ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. దీంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. తిరిగి సభ సమావేశమైన తర్వాత కూడా పరిస్థితి సద్దుమణగకపోవడంతో స్పీకర్‌ సిపి సింగ్‌ రెండో సారి వాయిదా వేశారు. రాంచీ శివారులోని నగరి గ్రామంలో ఉక్కు కార్మాగారం వల్ల నిరాశ్రయులైన పేదలకు పునరావాసం కల్పిచాలని ప్రతిపక్ష జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా (ప్రజా తాంత్రిక్‌) డిమాండ్‌ చేస్తోంది. సోమవారం సభ ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే తమ డిమాండ్‌పై ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. ఈ సంఘటన శాసనసభలో తీవ్ర ఉత్కంఠకు కారణమైంది. మొత్తానికి అధికారపార్టీ ఈ విషయంలో స్పష్టమైన హావిూ ఇవ్వలేకపోయింది.