నిద్రలేచిన బాబు రైతుల కోసం మహాధర్నా

చేతగాని ప్రభుత్వమిది.. అధికారంలో ఉండే అర్హత లేదు : బాబు
రైతు సమస్యలకు ప్రభుత్వ నిర్లక్ష్య మే కారణం : నారాయణ
హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి): రైతులను ఆదుకోలేని చేతకాని ప్రభుత్వం అధికారంలో ఉండే అర్హత లేదని టీడీపీ అధినేత నారాచంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. టీడీపీ, సీపీఐ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఆర్‌ఎస్‌పీతో పాటు రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహించారు. ధర్నా మధ్యలోనే చంద్రబాబు నాయుడు, నారాయణ, టీడీపీ ఎమ్మెల్యేలు సచివాలయాన్ని ముట్టడిస్తామంటూ బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అంతకుముందు ధర్నా ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా రైతులు కరువు కాటకాలతో సతమతమవుతుంటే ఈ చేతకాని ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదని అన్నారు. గత ఖరీఫ్‌లో వచ్చిన కరువును పరిశీలించేందుకు కనీసం కేంద్ర బృందాన్ని రప్పించి అంచనా కూడా వేయించ లేకపోయిందని, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అందించలేకపోయిందని అన్నారు. రైతాంగానికి వడ్డీ మాఫీ చేస్తామన్న ప్రభుత్వం అందుకు రూ.3వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా, రూ. 300 కోట్లు కూడా కేటాయించలేదని మండిపడ్డారు. అటువంటప్పుడు వడ్డీ ఎలా మాఫీ ఎలా చేస్తారని చంద్రబాబు నిలదీశారు. రైతులకు కనీసం విత్తనాలను కూడా సరఫరా చేయలేకపోతోందని, విత్తనాల కోసం రైతులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లడం దౌర్భాగ్యమన్నారు. రూ.950 రూపాయలకు బీటీ పత్తివిత్తనాల ప్యాకెట్లను అమ్మాల్సి ఉండగా, రూ. 2వేలకు అమ్ముతున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం దారుణమన్నారు. ఎరువుల ధరలను పెంచి ప్రభుత్వం రైతాంగ నడ్డి విరిచిందని ఆయన ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 12 సార్లు ఎరువుల ధరలను పెంచిందని, ఎరువులను కూడా రైతులకు ఇవ్వకుండా మిక్సింగ్‌ ప్లాంట్లకు ఇవ్వడం దారుణమన్నారు. ఏదిఏమైనా రైతుల సమస్యలు పరిష్కరించే వరకు తాము ఆందోళన విరమించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో విత్తనాల కొరత రావడం దారుణమన్నారు. ప్రభుత్వం చేతకాని తనం వల్లే విత్తనాలు, ఎరువులు రైతులకు చేరడంలేదని, ముందు చూపు, ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్‌ హయాంలో కాంట్రాక్టు ఫార్మింగ్‌ను తెరపైకి తెస్తే అప్పట్లో తాము వ్యతిరేకించామని, ఇప్పుడు మళ్లీ ఆ విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దానిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని నారాయణ స్పష్టం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు కోడెల శివప్రసాద్‌రావు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, మోత్కుపల్లి నిర్సంహులు, దయాకర్‌రెడ్డి, కరణం బలరామ కృష్ణమూర్తి, తీగల కృష్ణారెడ్డి, సాయన్న, మహేందర్‌రెడ్డి, సీపీఐ నాయకుడు రామకృష్ణతో పాటు పలు పార్టీల నాయకులు , రైతు సంఘాల నేతలు ఉన్నారు.