నేడు ఈ రూట్లలో ప్రయాణిచొద్దు

– వెల్లడించిన పోలీసులు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ప్రగతి నివేదన సభ సందర్భంగా నగరంలో ఆదివారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు, సర్వీసు రోడ్లపై సాధారణ ప్రజలు వెళ్లొద్దని, భారీ వాహనాల డ్రైవర్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలని సూచించారు. అంబులెన్స్‌ల రాకపోకలకు అందరూ సహకరించాలని కోరారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ఓఆర్‌ఆర్‌ వైపు రావొద్దని, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే విూదుగానే ఎయిర్‌పోర్టుకు వెళ్లాలని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ చెప్పారు.
ట్రాఫిక్‌ అధికంగా ఉండే మార్గాలు ఇవే..
కూకట్‌పల్లి-మియాపూర్‌- హఫీజ్‌పేట్‌- గచ్చిబౌలీ- ఓఆర్‌ఆర్‌ మార్గాలు,  ఉప్పల్‌-నాగోలు- ఎల్బీనగర్‌ – సాగర్‌రోడ్డు, ఆదివారం రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ట్రాఫిక్‌ ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌ వైపు వచ్చే అన్ని రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ ఉంటాయని, హైదరాబాద్‌ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే రహదారులన్నీ రద్దీగా ఉంటాయన్నారు. ట్రాఫిక్‌ రద్దీ సమాచారం కోసం ఆదిభట్లలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు 94935 49410, 94935 49411గా ప్రకటించారు. అదేవిధంగా ప్రగతి నివేదన సభ నేపథ్యంలో ఆదివారం ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)మార్గం పూర్తిగా సభకు వచ్చే వాహనాలతో నిండిపోనుందని, సభ జరిగే ప్రాంతం కొంగరకలాన్‌.. శంషాబాద్‌ విమానాశ్రయానికి 14 కిలోవిూటర్ల దూరంలోనే ఉందన్నారు. అంతే కాదు.. శ్రీశైలం, సాగర్‌కు వెళ్లే ప్రధాన రహదారుల మధ్య ఓఆర్‌ఆర్‌కు ఆనుకునే ఈ ప్రాంతం ఉంటుందని తెలిపారు. అంటే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఇతర ప్రాంతాలకెళ్లే సాధారణ జనం.. సభ కారణంగా ఏర్పడే ట్రాఫిక్‌లో చిక్కుకుపోయే ప్రమాదం ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. అందుకే సాధారణ ప్రయాణికులెవరూ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రయాణించొద్దని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే వారు నిర్ణీత సమయంలో గమ్యానికి చేరుకోలేరని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే విూదుగా శంషాబాద్‌కు చేరుకోవచ్చని సూచిస్తున్నారు.
—————————–