నేడు సమరదీక్ష
అనుమతి నిరాకరించిన పోలీసులు
జరిపి తీరతామంటున్న తెలంగాణ ఐకాస
అడ్డుకుంటే ఎక్కడికక్కడే దీక్ష పూనండి
ఏది జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత
సీమాంధ్ర సర్కారు కాబట్టే అ నుమతివ్వలేదు : కోదండరాం
హైదరాబాద్: ఇందిరాపార్కు వద్ద ఆదివారం తాము తల పెట్టిన సమర దీక్షకు ప్రభుత్వం అనుమతించి ఉంటే ఆ ఒక్కచోటే జరిగేదని, అనుమతి నిరాకరణతో మొత్తం తెలంగాణ అంతటా జరుగుతుందని తెలంగాణ రాజకీయ ఐకాస ప్రకటించింది. ప్రభుత్వం అనుమతి నిరాకరించినా ఇందిరా పార్కు వద్ద పిలుపునిచ్చింది. దీక్షకు వచ్చేవారిని పోలీసులు అడ్డుకుంటే, ఎక్కడ అడ్డుకుంటే అక్కడే కూర్చుని 36 గంటల పాటు సమరదీక్ష చేయాలంది. ఒక్కచోట దీక్షకు నిరాకరించినందుకు తెలంగాణ అంతటా సమర దీక్షలు చేయాలని పిలుపునిచ్చింది. ఇలా సమర దీక్షలో కూర్చునే వారికి స్థానిక ప్రజలు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభకు అనుమతివ్వనందునే విగ్రహాలు పగిలాయని, ఇప్పుడూ అనుమతివ్వకుండా హైదరాబాద్‌ను ఏం చేద్దామని ప్రభుత్వం భావిస్తోందని ప్రశ్నించింది. ఐకాస ఛైర్మన్ కోదండరాం, నేతలు రాజేశ్వర్‌రావు, దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, మల్లేపల్లి లక్ష్మయ్య, అద్దంకి దయాకర్, రఘు, రసమయి బాలకిషన్, శ్రీధర్,పిట్టల రవీందర్, కృష్ణా యాదవ్ తదితరులు శనివారమిక్కడ ఐకస కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు అంతకుముందు తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌తో కలిసి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసానికి వెళ్లి ఆమెను కలిశారు. సమర దీక్షకు అనుమతివ్వాలని కోరారు. ఒక గంట సమయం ఇవ్వాలని, నిర్ణయం చెప్తానని ఆమె బదులిచ్చారు. అనంతరం గంటసేపు వేచి చూసిన అనంతరం ఐకాస నేతలు తమ కార్యాలయానికి వచ్చి విలేకరులతో మాట్లాడారు. కోదండరాం మాట్లాడుతూ, ఉండవల్లి అరుణ్ కుమార్ జై ఆంధ్రప్రదేశ్ సభ నిర్వహించుకునేందుకు అనుమతిచ్చారని, తెలంగాణ కోసం సమర దీక్ష కార్యక్రమం చేస్తే అనుమతివ్వక పోవడం గర్హనీయమని వ్యాఖ్యానించారు. ఇందిరా పార్కు వద్ద దీక్షలు చేసుకునేందుకు చట్టపరమైన అనుమతి ఉందని, ప్రతిరోజు ఎన్ని సంఘాలు దీక్ష చేసుకుంటామన్నా అక్కడ అనుమతి ఇస్తున్నారని గుర్తు చేశారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని, విచ్ఛిన్నకర శక్తులు ప్రవేశిస్తాయని అంటూ సమరదీక్షకు అనుమతి నిరాకరించడం దారుణమన్నారు. దీనికి తెలంగాణ మంత్రులు, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. రాజేశ్వర్‌రావు, దేవీప్రసాద్, శ్రీనివాసగౌడ్, మల్లేపల్లి లక్ష్మయ్య, అద్దంకి దయాకర్ తదితరులు మాట్లాడుతూ, ఒక్కచోట సమరదీక్షకు అనుమతి నిరాకరించినందుకు నాలుగున్నర కోట్లమంది రోడ్లపైకి వచ్చి దీక్షలు చేయడమే ప్రభుత్వానికి సరైన సమాధానమన్నారు.. ఉద్యోగులంతా ఎన్ని పనులున్నా సమర దీక్షకు తరలిరావాలని కోరారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు దీక్షలో పాల్గొంటున్నా ఒక్క పోలీసు శాఖ మాత్రం వ్యతిరేకంగా పని చేస్తోందన్నారు. హైదరాబాద్‌లో తమ చేతిలో ఉన్న నీటి సరఫరా, మురికి నీటిపారుదల తదితర విభాగాల ఐకాసలతో కలిసి కూర్చుని పోలీసు విభాగంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పారు. అవసరమైతే ఆదివారమే ఒక సమావేశం కూడా నిర్వహించుకుంటామని శ్రీనివాస్‌గౌడ్ తెలియజేశారు.



