నేరుగా ఐటిడిఎ ద్వారా రుణాలు అందించాలి

ఆదిలాబాద్‌, జూలై 26 : గిరిజనుల అభివృద్ధి కోసం వివిధ బ్యాంకులతో నిమిత్తం లేకుండా నేరుగా ఐటిడిఎ ద్వారా రుణాలు అందించాలని గిరిజన నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నాయకులు శ్రీడాం శంభు, సంజీవ్‌, సీతారాములు నేతృత్వంలో జిల్లా కలెక్టర్‌ అశోక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా అందించే వివిధ యూనిట్లకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడంలో అశ్రద్ధ చేస్తున్నారని వారు పేర్కొన్నారు. బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా గిరిజనులకు అందాల్సిన 40 శాతం రాయితీ అందడం లేదని అన్నారు. వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు రుణాలు ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల గిరిజన రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. గిరిజన రైతులకు వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, స్పీకర్లు, ఆయిల్‌ ఇంజన్లు, విద్యుత్‌ మోటర్లను అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రోడ్లు గ్రామ సభ తీర్మానాల మేరకే పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌ను కోరారు.