పట్టణంలో సినీ హీరో మనోజ్‌ సందడి

విజయనగరం, ఆగస్టు 3 : సినీనటుడు మంచు మనోజ్‌కుమార్‌ స్థానిక సప్తగిరి థియేటర్‌లో ‘ఊ కొడుతారా… ఉలిక్కి పడతారా’ చిత్ర యూనిట్‌తో చేసిన సందడి ప్రేక్షకుల్లో ఉర్రూతలూగించింది. తాను నటించిన ఈ చిత్రాన్ని ఆధరించిన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘ఎవడైనా ఈ కోట నాది అంటే తెలుసుగా’ అన్న బాలయ్య చెప్పిన డైలాగ్స్‌తో మనోజ్‌ అక్కడివారందరినీ ఆకట్టుకున్నారు. అభిమానులు మనోజ్‌ను బాణాసంచాలతో ఊరేగింపుగా థియేటర్‌ వరకు తీసుకువెళ్ళిన అనంతరం ఆయన మాట్లాడుతూ బాలకృష్ణ అభిమానులకు, మోహన్‌బాబు అభిమానులకు ఎంతో రుణపడి ఉంటానని చెప్పి ప్రేక్షకులకు అభివాదం తెలిపారు. హాస్యనటుడు లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా మనోజ్‌కుమార్‌ తన నటనా స్వరూపాన్ని చూపించారన్నారు. ఈ విజయయాత్ర ఎంతో ఆనందంగా ఉందని శతదినోత్సవాన్ని మళ్ళీ మీ మధ్యనే జరుపుకుంటామని మనోజ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో థియేటర్‌ యాజమాన్యం కూడా పాల్గొన్నారు.