పత్తి కొనుగోలులో మోసాలు జరగకుండా చర్యలు తీసుకొండి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : జిల్లాలో పత్తి కొనుగోలు ప్రారంభమైనప్పటికీ పత్తికి రైతులు అనుకున్న ధర రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎరువులు, విత్తనాలు పెరిగిన దృశ్య పత్తి క్వింటాలుకు ఆరువేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నప్పటికీ, కనీసం ఐదువేల రూపాయల ధర పలుకుతుందని ఆశించిన రైతులకు నిరాశ ఎదురైంది. సోమవారం పత్తి కొనుగోలు ప్రారంభమై పత్తి క్వింటాలుకు కేవలం 4,100 ధర నిర్ణయించారు. జిల్లాలోని ఆదిలాబాద్‌. బైంసా మార్కెట్లలో పత్తి కొనుగోలు ప్రారంభమైంది. ప్రభుత్వ రంగ సంస్థలైన సిసిఐ, మార్క్‌ఫెడ్‌లు రంగంలోకి దిగకపోవడంతో ప్రైవేటు వ్యాపారస్తులు నిర్ణయించిన ధరకే రైతులు తమ పత్తిని అమ్ముకోవాల్సి వచ్చింది. మార్కెట్‌లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వ్యాపారస్తులపై అధికారులు కఠిన చర్యలు తీసుకొని రైతులకు నష్ట వాటిల్లకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ సమక్షంలో పత్తి క్వింటాలుకు 4,100 ధర నిర్ణయించి అనంతరం పత్తి క్వింటాళ్లుకు 3,800 రూపాయలు చెల్లించడాన్ని రైతులు తీవ్రంగా పరిగనిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో పత్తి ధర నిర్ణయించి కొనుగోలు ప్రారంభమైన తరువాత, పత్తి క్వింటాలుకు 300 రూపాయలు తగ్గించడాన్ని రైతులు తట్టుకోలేకపోతున్నారు. సంకేతిక కారణాలు చూపి ధరను తగ్గించామని చెబుతున్న వ్యాపారస్తులపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. మార్కెట్‌లో ఒక ధరను ప్రకటించి, తరువాత మరో ధరను ఇస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ధర విషయంలో, తూకాల్లో మోసాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకొని రైతులకు నష్టం కలగకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.