పారిశుద్ధ్యాన్ని పరిశీలించండి
మెదక్, జూలై 17 : గ్రామాలలో తాగు నీటి సమస్య పారిశుద్ధ్యం గురించి సమయానుసారం చర్యలు తీసుకున్నట్లయితే వర్షాకాలంలో వచ్చే వ్యాధులను అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ ఎ. దినకర్‌బాబు అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామాలకు మంచి నీటి పరీక్షా బాటిళ్లను పంపిణీ చేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంచినీరందించేందుకు, గ్రామాలలో పారిశుద్ధ్యం నిర్వహించేందుకు పంచాయతీ కార్యదర్శి పాత్ర చాలా ముఖ్యమైనదని, ఈ బాధ్యతను గురైరిగి పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలని ఆయన సూచించారు. మంచి నీటి, పారిశుద్ధ్య సమస్యలున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి వాటిని వెనువెంటనే పరిష్కరించాలని, నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి కిరోసిన్ వేసి, మట్టితో పూడ్చాలన్నారు. మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపర్చి క్లోరినేషన్ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సూచించారు. వర్షాలు కురుస్తున్నందున అధికారులు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలన్నారు. ఈఓపిఆర్డిలు క్లిష్టమైన గ్రామాలు, సమస్యత్మకమైన గ్రామాల వివరాలు తదితర జాబితాలను సిద్ధం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు మంచి నీరు పారిశుద్ధ్యం సమస్యలు తలెత్తకుండా గట్టి చర్యలు చేపట్టాలని అన్నారు.