పేదలకు పాఠశాలల్లో 25 శాతం సీట్లుమంత్రి శైలజానాధ్
హైదరాబాద్, జూలై 5 (జనంసాక్షి):
ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25 శాతం సీట్లు పేదలకు కేటాయించేలా విధి, విధానాలు రూపొందిస్తున్నట్లు మంత్రి శైలజానాథ్ తెలిపారు. విద్యాశాఖ చేపడుతున్న విద్యాపక్షోత్సవాలు ఈ నెల 9 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నట్లు సచివాలయంలో గురువారం మీడియాకు ఆయన వివరించారు. విధి, విధానాల నివేదిక అందగానే అమలు పరుస్తామని ఆయన అన్నారు. 9, 10 తరగతులను కూడా విద్యాహక్కు చట్టం కిందకు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అయితే ఈ విషయంపై కేంద్రంతో చర్చిస్తామని ఆయన అన్నారు. విద్యాపక్షోత్సవాలను ఈ నెల 9వ తేదీన లలిత కళాతోరణంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభిస్తారని అన్నారు. దాదాపు కోటి 42 లక్షల మంది విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. బడికి వెళ్లని పిల్లలను వందశాతం పాఠశాలల్లో చేర్పించే విధంగా విద్యాశాఖ చర్యలు చేపడుతున్నదని అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. 24,748 ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టామని తెలిపారు. ప్రతి పాఠశాలకు మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతేకాక ప్రతి పాఠశాలకు ప్రహరి గోడ నిర్మించేలా, అలాగే వాచ్‌మెన్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాం పంపిణీ చేయనున్నామని అన్నారు. విద్యార్థులకు యూనిఫాం పంపిణీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆగ్రగామిగా నిలిచిందని అన్నారు. ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు త్వరలో డిఎస్సీ నిర్వహిస్తామని మంత్రి శైలజానాధ్ అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యాప్రమాణాలతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.