పేలుళ్ల మృతులకు సభ సంతాపం

విపక్షాల ఆందోళనలతో అసెంబ్లీ నేటికి వాయిదా
అవిశ్వాసంపై  స్పీకర్‌కు టీఆర్‌ఎస్‌, వైకాపా నోటీసు
హైదరాబాద్‌, మార్చి 14 (జనంసాక్షి):
అనుకున్నట్టే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు రసాభాసగా సాగుతున్నాయి. రెండోరోజు గురువారం నాడు సభా ప్రారం భం నుంచే గందరగోళం నెలకొనడంతో అసెంబ్లీని శుక్రవారం నాటికి స్పీకర్‌ మనోహర్‌ వాయిదా వేశారు. సభ ప్రారంభం కాగానే తెలంగాణ అంశంపై చర్చ చేపట్టాలంటూ టీఆర్‌ఎస్‌ సభ్యులు నినాదాలు చేశారు. సహకరించాలంటూ స్పీకర్‌ మనోహర్‌ విజ్ఞప్తి చేసినా టీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలతో హోరెత్తించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఎవరి స్థానాల్లోకి వారు వెళ్లాలని స్పీకర్‌ పదేపదే విజ్ఞప్తి చేసినా వారు పెడచెవిన పెట్టారు. దీంతో సభను గంట పాటు వాయిదా వేశారు. తిరిగి సభా   సమావేశమైనప్పటికీ అవే దృశ్యాలు పునరావృతమయ్యాయి.  ప్రారంభం కాగానే మళ్లీ టీఆర్‌ఎస్‌ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరి తెలంగాణపై చర్చ జరగాల్సిందేనంటూ పట్టుబడుతూ నినాదాలు చేశారు. మరోవైపు ఇదే సమయంలో టీడీపీ సభ్యులు తమ స్థానాల్లో లేచి నిలబడి విద్యుత్‌ కోతలపై చర్చ జరపాలని నినాదాలు చేశారు. వేళాపాళా లేకుండా విచక్షణా రహితంగా విద్యుత్‌ కోతలు విధించడంతో ప్రజలు అల్లాడుతున్నారని వారు ఆరోపించారు.  విద్యుత్‌ సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ నిందించారు. సాగునీరు లేక రైతులు, పరీక్షల సమయంలో  కరెంట్‌ ఎప్పుడు ఉంటుందో తెలియక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, అందువల్ల దీనిపై చర్చ జరగాలని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలంటూ టీడీపీ సభ్యులు చేశారు. నినాదాలతో వారు కూడా ప్పీకర్‌ పోడియం వద్దకు దూసుకెళ్లారు. సభ సజావుగా సాగితే అన్ని విషయాలూ చర్చిద్దామంటూ స్పీకర్‌ విజ్ఞప్తి చేశారు. సభ నిర్వహణకు సహకరించాలంటూ కోరినప్పటికీ పెడచెవిన పెట్టడంతో సభను తిరిగి మరో అరగంటపాటు స్పీకర్‌ వాయిదా వేశారు. అనంతరం సమావేశమైన తరువాత కూడా విపక్ష సభ్యులు తమ పట్టువీడకుండా తాము లేవనెత్తిన అంశాలపై చర్చ జరగాల్సిందేనంటూ భీష్మించి నినాదాలతో హోరెత్తించారు. ముందు దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన పేలుళ్ల మృతులకు సంతాపం ప్రకటిద్దామని, ఆ తరువాత మిగతా ఎజెండాలోకి వెళదామని స్పీకర్‌ చెప్పడంతో సభ్యులు అంగీకరించారు. దీంతో పేలుళ్ల మృతులకు  సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాల పాటు సభ మౌనం పాటించింది. దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లను శాసనసభ ముక్తకంఠంతో ఖండించింది. కష్టసమయంలో బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది. పేలుళ్లలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అనంతరం ఎజెండా అంశాలు చేపట్టేందుకు స్పీకర్‌ ఉద్యుక్తులయ్యారు. ఈ సమయంలో విపక్ష సభ్యులు మళ్లీ తమతమ ఎజెండాపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతూ నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్‌ ఎన్నిమార్లు విజ్ఞప్తిచేసినా సభ అదుపులోకి రాకపోవడంతో శుక్రవారం ఉదయం 9 గంటలకు స్పీకర్‌ సభను వాయిదా వేశారు.

అంతకుముందు ఈ ఉదయం సభ ప్రారంభంలో తెలంగాణ ఎజెండాతో టీఆర్‌ఎస్‌ సభ్యులు 25 మంది సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్‌కు అందజేశారు.  బీజేపీ, వామపక్షాలు , తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి వంటి నేతలతో కలిసి టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ తదితరులు అవిశ్వాసం తీర్మానంపై నోటీసును అందజేశారు. అయితే సభ జరుగుతున్నప్పుడు  స్పీకర్‌ అందుబాటులో ఉన్నప్పుడు గంట ముందుగా స్పీకర్‌కు నోటీసును అందజేయాల్సి ఉంది. అయితే టీఆర్‌ఎస్‌ గంట ఆలస్యంగా నోటీసును అందజేయడంతో దీనిపై చర్చకు చేపట్టాలా వద్దా అనే నిర్ణయానికి కూడా నేడు అవకాశం లేకపోవడంతో దీనిపై ఎలాంటి నిర్ణయం జరగలేదు. అవిశ్వాసానికి మద్దతు ఇచ్చే నాయకులంతా కలిసి వెళ్లి నోటీసు ఇవ్వాలనుకోవడంతోనే ఆలస్యమైందని టీఆర్‌ఎస్‌ నేత ఈటెల ఆ తరువాత విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. తమకు మద్దతు ఇచ్చేవారు కొంత మంది సంతకాలు చేయనప్పటికీ సభలో అవసరమైన సమయంలో లేచి నిలబడడం ద్వారా లెక్కింపు సమయంలో మద్దతు పలుకుతామని చెప్పారన్నారు. ఇదిలా ఉండగా వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో కూడా అవిశ్వాస తీర్మానాన్ని అందజేసినట్టు ఆ పార్టీ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. వీటిపై శుక్రవారం నాడు స్పీకర్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా ఈ ఉదయం సభ మొదటి సారి గంట పాటు వాయిదా పడిన అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. విపక్షాలు అవిశ్వాస తీర్మానానికి సన్నద్ధమవుతున్న సమయంలో ఒక వేళ చర్చకు వస్తే సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన మంత్రులతో సమాలోచనలు జరిపారు.

శాసనమండలి కూడా శుక్రవారం నాటికి వాయిదా పడింది మండలిలో సభ ప్రారంభం కాగానే విద్యుత్‌ సమస్యపై చర్చించాలంటూ విపక్షాలు రగడ సృష్టించాయి. సర్‌చార్జీలను ఉపసంహరించాలంటూ విపక్ష సభ్యులంతా మండలి చైర్మన్‌ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభ సజావుగా సాగితే విషయాలన్నీ చర్చిద్దామని చైర్మన్‌ చక్రపాణి పదేపదే సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సభ్యులు ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని కోరినప్పటికీ వారు వినిపించుకోకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.

కాగా గురువారం టీఆర్‌ఎస్‌, వైకాపా సభ్యులు ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు నోటీసును అందజేశారు.