ప్రగతి నివేదన సభ సక్సెస్‌తో తదుపరి కార్యాచారణ
మరోమారు కేబినేట్ నిర్ణయం జరిపే ఛాన్స్
ఒకటిరెండు రోజుల్లో క్లారిటీ
హైదరాబాద్,సెప్టెంబర్3(జనం సాక్షి): రాష్ట్రంలో షెడ్యూల్‌కంటే ముందే శాసనసభ ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహం విజయవంతం కావడంతో ఇక తదుపరి వ్యూహంపై కెసిఆర్ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడంతా అసెంబ్లీ రద్దు ఎప్పుడు…తదుపరి కేబినేట్ భేటీ ఎప్పుడన్న దానిపైనే చర్చ సాగుతోంది. మిగతా వర్గాల కోసం ఏయే తాయిలాలు ప్రకటించాలన్నది కెసిఆర్ కసరత్తు చేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బహుశా ఇవ్వాళ రేపట్లో కేబినేట్ ఏర్పాటు చేసి మరిన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగేలా కనిపిస్తోంది. శాసనసభను రద్దు చేసి ముందుగా ఎన్నికలకు వెళ్లే విషయంలో ఏ నిర్ణయం తీసుకోవడానికైనా మంత్రిమండలితోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కమిటీలు తనకు అధికారమిచ్చాయని, ఈ మేరకు వచ్చే కొద్ది రోజుల్లో రాజకీయపరమైన నిర్ణయాలు ఉంటాయని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో 6వ తేదీన మంత్రివర్గం మరోసారి సమావేశమై శాసనసభ రద్దుకు సిఫారసు చేస్తుందని భావిస్తున్నారు. ఎన్నికలకు వెళ్లడం దాదాపుగా ఖాయమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్కీ నంబర్ ఆరు కావడం వల్ల అదే రోజు శాసనసభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటారని టీఆర్‌ఎస్ వర్గాలు కూడా వెల్లడించాయి. ఆ వెంటనే మంత్రివర్గం గవర్నర్‌ను కలసి శాసనసభ రద్దు తీర్మానాన్ని అందిస్తుందని పేర్కొన్నాయి. శాసనసభను రద్దు చేసినా కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా కేసీఆర్ నాయకత్వంలోని మంత్రిమండలి ఆపద్ధర్మ ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని చెబుతున్నాయి. శాసనసభను రద్దు చేస్తూ ఆదివారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయంతీసుకోవాలని ముందుగానే భావించినా చివరి క్షణంలో దాన్ని వాయిదా వేసుకున్నారని సమాచారం. అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకుని ప్రగతి నివేదన సభలో అధికారికంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి అనుకున్నారని, కానీ కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా 6వ తేదీకి దాన్ని వాయిదా వేశారని అత్యున్నత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అందుకే కేబినెట్ సమావేశం కేవలం 15 నిమిషాలే జరిగిందని తెలిసింది. దీనికితోడు ప్రభుత్వ ఉద్యోగులకు వేతన పవరణకు సంబంధించి మధ్యంతర భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు లాంటి
ముఖ్యమైన నిర్ణయాలను కూడా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉండటం కూడా ఆదివారం నాటి సమావేశంలో అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకోకపోవడానికి కారణమని అంటున్నారు. ఈ రెండింటితోపాటు ముఖ్యమైన విధానపరమైన అంశాలను వచ్చే 2 లేదా మూడు రోజుల్లో ప్రకటించి 6న శాసనసభ రద్దుకు నిర్ణయం తీసుకుంటారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభ విజయవంతం కావడం పార్టీ నాయకత్వానికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు సభకు తరలిరావడంతో ముందస్తు ఎన్నికలకు చర్యలు వేగవంతం చేయాలన్న నిర్ణయానికి అధికార పార్టీ వచ్చింది. ఇకపోతే త్వరలోనే మంత్రివర్గ సమావేశం జరగనుంది. విూ శాఖల పరిధిలోని ప్రతిపాదనలను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలలోగా పంపించాలి’అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు సర్క్యులర్ జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వారంలోపే మళ్లీ మంత్రివర్గ సమావేశం జరగనుండటం ఆసక్తికరంగా మారింది.



