ప్రభుత్వం విచారణను ప్రారంభించిన ఓంశక్తి ఫ్యాక్టరీ

చెన్నై: ఓంశక్తి ఫ్యాక్టరీకి సంబంధించిన లైసెన్సును మూడు నెలల కిందటే రద్దుచేసినప్పటికీ యథేచ్ఛగా వ్పాపారం కొనసాగిస్తున్నారు. బుధవారం జరిగిన ఘోరప్రమాదం అనంతరం ప్రభుత్వం దీనిపై విచారణ ప్రారంభించింది. మూడు నెలల కిందటే జరిగిన తనిఖీల్లో ఈ ఫ్యాక్టరీ మొత్తం 40 రకాల ఉల్లంఘనలకు పాల్పడిందని అధికారులు గుర్తించారు. ఇందులో పరిమితికి మించి తయారైన బాణాసంచాలను నిల్వచేయటం, గరిష్ఠ ఉద్యోగుల సంఖ్య 200 మాత్రమే ఉండగా 300 మందిని నియమించుకోవటం, 35 షెడ్లకు అనుమతిని పొంది 45 షెడ్లను నిర్వహించటం లాంటి ఉల్లంఘనలు ఉన్నాయి. కాగా లైసెన్సు రద్దు విషయాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యానికి తెలపటంలో తీవ్ర జాప్యం ఏర్పడిందని అనంతరం రెవెన్యూ అధికారులు ప్రకటించారు. లైసెన్సు రద్దుకు సంబంధించిన ఆదేశాలు సంఘలనకు ఒకరోజు ముందు అందినా దీనిని సదరు ఫ్యాక్టరీ యాజమాని బేఖాతరు చేసి వ్యాపారాన్ని నిర్వహించారని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సంఘటనకు సంబంధిచి పోలీసులు గురువారం మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. ఇందులో ఈ ఫ్యాక్టరీని లీజుకు తీసుకున్న నలుగురు యజమానులు, ముగ్గురు నిర్వాహకులు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఈ స్థల యజమాని మురుగేశన్‌ పరారీలో ఉన్నారు. స్థల యజమాని ఫ్యాక్టరీని ఇతరులకు లీజుకు ఇవ్వటమే చట్ట విరుద్ధమని ఆయన అన్నారు.