ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్‌ఎస్‌ కుట్ర

` దాడులతో అరచాకం సృష్టిస్టే కఠినంగా అణచివేస్తాం
` రైతుల ముసుగులో గులాబీ గుండాల దాడులు
` లగచర్ల ఘటనను ఉపేక్షించేది లేదు
` రైతులకు నష్టం చేసే ఉద్దేశ్యం లేదు
` మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరిక
హైదరారాబాద్‌(జనంసాక్షి)రైతుల ముసుగులో కొంతమంది గులాబీ గూండాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు చేశారు. కుట్రపూరితంగా అధికారులను రైతులకు దూరం చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారని మండిపడ్డారు. గులాబీ గూండాల కుట్రలను రైతాంగం అర్ధం చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలను కాపాడుకున్నట్లే, అధికారులను కాపాడుకోలేకపోతే పని చేయడానికి ఏ అధికారి ముందుకు వస్తారని ప్రశ్నించారు. గురువారం గాంధీభవన్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విూడియా తో మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కూడా ఇదే పద్ధతి పాటించారా అని నిలదీశారు. రైతులను నష్టపెట్టాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని మంత్రి పొంగులేటి అన్నారు. వారి సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని తెలిపారు. రైతుల ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. లగచర్ల సంఘటను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని అన్నారు. ఈ రోజు అధికారులపై దాడి జరిగినట్లుగానే ..రేపు రాజకీయ నాయకులు, ప్రజలపై దాడి జరిగితే ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. వికారాబాద్‌ జిల్లాకు ఫస్ట్‌ మేజిస్టేట్ర్‌గా ఉన్న కలెక్టర్‌పైనే హత్యాయత్నం చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. అధికారుల విూద దాడి జరగడం మనవిూద మనం దాడి చేసుకునట్లేనని అన్నారు. ఏం తప్పుచేశారని ఆనాడు ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసి జైల్లో పెట్టారని ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌లో రైతులను దేశద్రోహులుగా చిత్రీకరించారని ఆరోపించారు. పిల్లా, పాపా, ముసలి అనే తేడా లేకుండా రాత్రికి రాత్రి వారిని అరెస్ట్‌ చేసి సంకెళ్లు వేసిన సంగతి మరిచారా అని ప్రశ్నించారు. కేటీఆర్‌ నియోజకవర్గం సిరిసిల్లలో దళితులకు బేడీలు వేసిన సంగతి మరిచిపోయారా అని నిలదీశారు. లగచర్లలో ఆ పరిస్ధితి లేదు కదా అని మంత్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.