ఫోటో జర్నలిస్టుల శ్రమ వెలకట్టలేనిది

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంలో మంత్రి హరీష్‌ రావు

పలువురికి అవార్డుల బహుకరణ

హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): ఫోటోగ్రాఫర్‌ల శ్రమ వెలకట్టలేనిదని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ఉద్యమ సమయంలో పోలీసులకు మాకు మధ్య ఫోటోగ్రాఫర్లు రక్షణగా ఉండేవారని తెలిపారు. కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లే చాలాసార్లు కాపాడారని గుర్తు చేశారు. వ్యవస్థకు రక్షకులుగా ఫోటోగ్రాఫర్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో తెలంగాణ ఫోటో జర్నలిస్టులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీపాటీల్‌, విూడియా అకాడవిూ చైర్మన్‌ అల్లం నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ…. వరదలు, కరువులు, అధికారుల, మంత్రుల, ఎమ్మెల్యేల పర్యటనలు, ఉద్యమాలు, పోరాటాలను సమాజానికి తెలపాలన్న తపనతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాళ్లు, కొండలు, స్తంభాలు, బంగ్లాలు, ఇండ్లపైకి ఎక్కి ఫోటోలు తీస్తుంటారు. జర్నలిస్టు ఎంత కష్టపడి పనిచేస్తాడో ఫోటోగ్రాఫర్‌ అంతకంటే ఎక్కువే కష్టపడతాడు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులతో సమానంగా ఫోటోగ్రాఫర్లకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఇకపై వారిని ఫోటోజర్నలిస్టులుగా గుర్తించాలని, అక్రిడిటేషన్‌లో అదేవిధంగా ఉండేలా చూడాలని, ఇంకా ఏమైనా సౌకర్యాల కల్పించకుంటే వాటికి కూడా అవకాశం కల్పించాలని అల్లం నారాయణకు విజ్ఞప్తి చేశారు. దానికి ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహాకారం అందజేస్తామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.