బదలీల విషయంలో ఉపాధ్యాయులు నిరాసక్తి

ఆదిలాబాద్‌, జూన్‌ 30 : ప్రభుత్వం ఉపాధ్యాయుల బదలీల విషయమై ఉత్తర్వులు జారీ చేసినా బదలీ కోసం జిల్లాలోని ఉపాధ్యాయులు ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. జిల్లావ్యాప్తంగా 12 వేలకు పైగా ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. బదలీల కోసం 6 వేల మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకుంటారని విద్యాశాఖ అధికారులు ఆంచనా వేసినప్పటికీ ఇందుకు విరుద్ధంగా కేవలం 3 వేల 718 మంది ఉపాధ్యాయులు మాత్రమే బదలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో స్థానిక సంస్థ యాజమాన్య పరిధిలో 3 వేల 450 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వ యాజమాన్య పరిధిలో 263 మంది ఉపాధ్యాయులు మాత్రమే బదలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో స్పష్టత లేకపోవటం, ఏఅండ్‌బి క్యాటగిరిలను బ్లాక్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం, అడహక్‌ పదోన్నతి ఖాళీలను ప్రకటించకపోవడం తదితర అంశాల విషయమై ఉపాధ్యాయులు నిరాసక్తి చూపడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దరఖాస్తు చేసుకున్నవారిలో 50శాతంపైగా ఉపాధ్యాయులు ఒకే చోట 8 సంవత్సరాలు పని చేసినవారు ఉండడం, వీరంత తప్పని సరిగా బదలీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. వీరిని తీసివేస్తే కేవలం 2000 మంది ఉపాధ్యాయులు మాత్రమే సాధారణ బదలీల కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఉన్నారు. ప్రభుత్వం జారీ చేసిన 38 జీవోను సవరించాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలన్నీ ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ప్రభుత్వం ఉపాధ్యాయ బదలీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం పట్ల ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.