బీసీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత కులసంఘాలే తీసుకోవాలి:తేదేపా అధినేత

హైదరాబాద్‌: బీసీలకు తేదేపా ఇచ్చే వంద సీట్లలో అభ్యర్థులను గెలిపించే బాధ్యత కుల సంఘాలే తీసుకోవాలని తేదేపా అధినేత చంద్రబాబు అన్నారు. బీసీల అభ్యున్నతి కోరుతూ టీడీపీ ప్రకటించిన బీసీల డిక్లరేషన్‌కు బీసీ కులసంఘాలు చంద్రబాబును కలిసి ఘనంగా సన్మానించాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికలకు ఏడాదిముందే బీసీలకు వంద సీట్లు ప్రకటిస్తానని ఆ వంద సీట్లలో వారిని గెలిపించే బాధ్యత కుల సంఘాలే తీసుకోవాలని కోరారు. ఈ సమావేశం జరుగుతుండగా కరెంటు పోవడంతో ప్రభుత్వ పాలన తీరుపై బాబు విమర్శలు గుప్పించారు. విద్యుత్‌ సరఫరా చేయడం తన వల్ల కాదంటూ సీఎం చేతులు ఎత్తేయడం దౌర్భాగ్యమన్నారు. ఎలాగూ విద్యుత్‌ ఇవ్వలేరు కాబట్టి ఇంటింటికి ఒక లాంతరైనా ఇవ్వాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు.