బీసీ డిక్లరేషన్‌ జాతీయ అజెండా కావాలన్నది మా అభిమతం: చంద్రబాబు

ఢిల్లీ: బీసీలకు సామాజిక న్యాయం జరగడం  లేదని చంద్రబాబునాయుడు అన్నారు. బీసీ డిక్లరేషన్‌పై పలువురు జాతీయ నేతలతో భేటీ అయిన చంద్రబాబు ఈ రోజు సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ తమ బీసీ డిక్లరేషన్‌ జాతీయ అజెండా కావాలన్నది తెదేపా అభిమతమని చెప్పారు. ఓబీసీలకు సామాజిక న్యాయం జరగట్లేదని, ఆర్థిక సంస్కరణల ఫలితాలు అన్ని వర్గాలకు అందడం లేదని ఆయన  అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి చెందిన బీసీలకు అవకాశం  ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. బడ్జెట్‌లో ఓబీసీలకు 25 శాతం నిధులు ఉప ప్రణాళికకు కేటాయించాలన్నారు. బీసీల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు  నెలల  గడువు ఇస్తున్నామని, స్పందించకుంటే జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని చంద్రబాబు తెలియజేశారు.