బీసీ మంత్రుల ఆవేదనలో తప్పేమీ లేదు

ఉపముఖ్యమంత్రి రాజనరసింహ
హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి మంత్రి వర్గ ఉపసంఘం చేసిన సిఫార్సుల పట్ల బిసి మంత్రుల ఆవేదనలో తప్పేమీ లేదని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహా అన్నారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా సరైన ఫలితాలు సాధించలేకపోతున్నామని ఆయన అన్నారు. బిసి మంత్రుల ఆవేదనను మంత్రి వర్గ ఉపసంఘంలో చర్చిస్తామని చెప్పారు. రూ.31వేల ఫీజుకే కాలేజీలు అంగీకరించాయన్న సమాచారం తన వద్ద లేదని బయట నుంచి వినిపిస్తున్న వార్తలేనని ఆయన అన్నారు. దీనికి సంబంధించి నిర్ధిష్ట సమాచారం ఏదీ అందలేదన్నారు. ఉపసంఘం సిఫార్సుల వల్ల బిసిలు పార్టీకి దూరమవుతారని ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. బిసిలు కాని ఎస్సీలు కాని పార్టీని విడిచి వెళ్ళరని, అంతా పార్టీతోనే ఉంటారని రాజనరసింహ అన్నారు. బిసి, ఎస్సీ వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని కాంక్షించేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని ఆయన చెప్పారు. ఈ సాయంత్రం ఉపసంఘం సమావేశమై ఇంజనీరింగ్‌ కాలేజీల ప్రవేశానికి సంబంధించిన కౌన్సెలింగ్‌ తేదీలపై చర్చిస్తుందని చెప్పారు. కాగా, ఈ నెల 10వ తేదీన కౌన్సెలింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుపుతుంది. ఈ నెల 19నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా వుండగా బోధన రుసుము చెల్లింపునకు సంబంధించి ఉపసంఘం కేవలం సిఫార్సులు మాత్రమే చేస్తుందని తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని ప్రాథమిక విద్యా శాఖ మంత్రి ఎస్‌. శైలజానాథ్‌ అన్నారు. దీనిపై ఇప్పుడే అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఒకటవ తరగతి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు బోధన చెల్లింపు సౌకర్యాన్ని వర్తింపుచేస్తే బాగుంటుందని తన అభిప్రాయంగా చెప్పారు. ఈ సౌకర్యాన్ని ప్రభుత్వ సంస్థల్లో చదివే అన్ని వర్గాలకు అందిస్తే మంచిదని యన అభిప్రాయ పడ్డారు.