భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

హైదరాబాద్‌ : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. అర్థరాత్రి నుంచే వివిధ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కర్నూలు శ్రీశైలం మహాక్షత్రానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా మల్లిఖార్జునస్వామివారిని దర్శించుకున్నారు. రావణ వాహనంపై ఆలయ పురవీధుల్లో భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామి ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. కరీంనగర్‌ జిల్లా ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విజయవాడ లబ్బిపేటలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో అర్థరాత్రి 2 నుంచి భక్తులు స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు బారులు తీరారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.