భవిష్యత్‌పైనే మంత్రు కమిటీ దృష్టి

ఉప ఎన్నికల్లో ఓటమిపై పోస్టుమార్టం
15 రోజుల్లో నివేదిక : ధర్మాన
హైదరాబాద్‌, జూన్‌ 30 : సంక్షేమ పథకాల్లో చేపట్టాల్సిన మార్పులను పరిశీలిస్తామని, ఆ తర్వాత ఒక నివేదిక సమర్పిస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శనివారంనాడు మంత్రుల కమిటీ సమావేశమైంది. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి కొత్త రూపునిచ్చేందుకు మంత్రుల కమిటీ కృషి చేయనున్నట్టు చెప్పారు. అందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించామన్నారు. 15 రోజుల్లోగా ప్రాధమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలు ఎందుకు మొగ్గు చూపడం లేదో తెలుసుకుంటామన్నారు. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వ ఎన్నో ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం ఎందుకు గుర్తించడంలేదో అర్ధం కావడం లేదన్నారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటామన్నారు. ఆ దిశగా సంక్షేమ పథకాల్లో మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. కమిటీ విధివిధానాలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలియ జేశారని చెప్పారు. వాటిని ప్రాతిపదికగా తీసుకుని మంత్రుల కమిటీ ముందడుగు వేస్తుందని ధర్మాన చెప్పారు.