మధ్యాహ్న భోజనం వివాదంపై విచారణ

హుస్నాబాద్‌ రూరల్‌ జూన్‌ 26(జనంసాక్షి)  మండలంలోని గోవర్ధగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన వివాదంపై మంగళవారం అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాలలో వడ్డించే మధ్యాహ్న భోజనంలో  పురుగులు, రాళ్లు వస్తున్నాయని నాలుగు రోజుల నుంచి విద్యార్థులు పాఠశాలలో బోజనం చేయకుండా ఇంటి వద్దకే వెళ్లుచూ ఆందోళన కార్యక్రమాలను సైతం చేపట్టారు. ఈ విషయంపై విద్యార్థులు, విద్యాకమిటీ, గ్రామస్తులు, వంట నిర్వాహకులతో విడివిడిగా సమస్యలను తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం వహిస్తున్న వంట నిర్వా హకులను తొలగించాలని విద్యార్థులు , గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతు నిర్వాహకులను తొలగించే ప్రసక్తి లేదన్నారు. పాఠశాలలో గ్రూపు రాజకీయాలకు పాల్పడవద్దని వారు హెచ్చరించారు. భోజనంలో నాణ్యత లోపిస్తే తమ దృష్టికి తేవాలే తప్ప మధ్యాహ్న బోజన పథకాన్ని అడ్డుకుంటే సహించేది లేదని వారు తేల్చి చెప్పారు. గ్రామంలోని వీఓ సమావేశం నిర్వ హించి సభ్యులు సమన్వయంతో వంటకాలు చేయాలని సూచించారు.  గ్రామస్తులు, విద్యార్థుల నుంచి వచ్చిన ఆరోపణలపై సంజాయిషీ ఇవ్వా లని వంట నిర్వాహకులకు అధికారులు మెమోలు జారీ చేశారు. బుధవారం నుంచి మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు తినిపించే బాధ్యతను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తీసుకోవాలని తహశీల్దార్‌ రవిందర్‌ , ఎంపీడీఓ సుద్దాల చంద్రయ్య, ఎంఈఓ మనోహర్‌ గౌడ్‌ కోరారు.