మహాకవి కాళోజికి ఘన నివాళులు

హక్కులకోసం కలం పట్టిన కలంయోధుడు

 

బోనకల్ ,సెప్టెంబర్ 9 (జనం సాక్షి ):
బోనకల్ మండల వ్యాప్తంగా పలు ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, విద్యాలయాలలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వేణుమాధవ్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కలంతో సమాజాన్ని మేల్కొల్పిన మహాకవి కాళోజి అని అన్నారు.
హక్కుల కోసం కలం పట్టి గళం విప్పి ప్రజలను చైతన్యవంతం చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని కలకోట సర్పంచ్ యంగల దయామణి అన్నారు. కాళోజి జయింతి సందర్భంగా మండలంలోని కలకోట గ్రామపంచాయతీలోని శుక్రవారం ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా చైతన్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహాకవి ప్రజాకవి, పద్య కవి కాళోజీ అని,నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడని నిద్రాణంగా, నిర్లిప్తంగా, నిస్తేజంగా ఉన్న యువ సమాజాన్ని తన కలంతో మేల్కొల్పిన ప్రజాకవి అని కొనియాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల బోనకల్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నళిని శ్రీ అధ్యక్షత వహించారు. కళాశాల అధ్యాపకులు జే.జోనాథన్ బాబు మాట్లాడుతూ తెలంగాణ కోసం తెలంగాణ హక్కులకోసం నిక్కచ్చిగా పోరాడిన మహా వ్యక్తి కాళోజి అని ప్రజల గొడవను తన గొడవగా తీసుకొని నా గొడవ పేరుతో అద్భుతమైన రచనలు చేశారని కొనియాడారు .చరిత్ర అధ్యాపకులు అంతోటి.తిరుపతి రావు మాట్లాడుతూ కాళోజీ నారాయణ రావు జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశారని తన భావాలను తెలంగాణ యాసలో అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారని తెలియజేశారు. 1992లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మవిభూషన్ పురస్కారాన్ని అందించిందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.